వాట్సాప్ పేమెంట్స్ చేస్తున్నారా.. జర జాగ్రత్త!

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను డిజిటల్ పేమెంట్స్ సేవలు అందించేందుకు అనుమతించడం... సింపుల్‌గా చెబితే వాట్సాప్ లాంటి భారీ యూజర్ బేస్ ఉన్న యాప్స్‌కు.. పేటీఎం, ఫోన్‌పే మాదిరిగా చెల్లింపుల సేవల రంగంలో ప్రవేశించేందుకు అనుమతిని ఇవ్వడం... ఇప్పుడు ఈ అంశం పైనే కేంద్ర ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపైనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేటేషన్ ఆఫ్ ఇండియా సంస్థలతో సంప్రదించి.. మెసేజింగ్ యాప్‌లకు ఈ తరహా సేవలు అందించడంలో ఉన్న ప్రమాదాలపై చర్చించనుంది. అది కూడా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తులు దీనిపై భేటీలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణం ఈ తరహా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, మెసేజింగ్ యాప్‌లు త్వరగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉండడమే.
మొదలు అక్కడే
“ఒకవేళ హ్యాకింగ్‌కు గురయితే ఫైనాన్షియల్ డేటా రక్షణకు తీసుకోవాల్సిన అదనపు చర్యలు మరియు సేఫ్టీ ఫీచర్స్‌పై ఆర్బీఐ, ఎన్‌సీపీఐలతో చర్చించబోతున్నాం,” అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెబుతున్నారు.
ఇజ్రాయిలీ కంపెనీ ఎన్‌ఎస్ఓ, ఆ కంపెనీ అందిస్తున్న సాఫ్ట్‌వేర్ పెగసస్‌పై అమెరికా సంయుక్త రాష్ట్రాలలో తాజాగా దాఖలు అయిన న్యాయ వివాదం కారణంగా.. మన ప్రభుత్వం ఎలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఫేస్‌బుక్ యాజమాన్యంలో నడుస్తున్న వాట్సాప్‌లో.. మెసేజింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా గోప్యత, రక్షణ కల్పిస్తుండడాన్ని ఇక్కడ గమనించాలి.
మెయిట్‌వై-వాట్సాప్
ఆర్థిక విభాగం నిర్దేశించే ప్రమాణాలను పాటించాల్సి రావడంతో, పేమెంట్ ఫీచర్‌ను కూడా అందించేలా వాట్సాప్ ఆలోచనను.. తాజా పరిమాణాలు మరింత ఆలస్యం చేసే అవకాశాలున్నాయి. ఈ సర్వీస్‌ను ప్రారంభించడంపై ఎంతో ఆసక్తిగా ఉన్నట్లుగా తాజా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా వ్యాఖ్యానించారు.
ప్రాథమికంగా మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ మన దేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ సంస్థ గతేడాదే పేమెంట్ సర్వీస్‌ను టెస్టింగ్ చేసింది. అయితే కొన్ని డివైజ్‌లకు మాత్రమే ఈ సేవను అందించినా, ఇంకా దీనిని విస్తరించలేదు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే తరహాలలో పేమెంట్స్ విభాగంలో విస్తరణ, ప్రచార కార్యక్రమాలను చేపట్టలేదు.
భద్రత సంగతేంటి?
ఇదే సమయంలో, భద్రతా ఉల్లంఘన అంశంపై వివరాలతో సహా తెలియజేసే అంశంపై వాట్సాప్, భారత అధికారుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. సమాచారం ఇప్పటికే అందించారనే వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
"పూర్తి సమాచారాన్ని వాట్సాప్ మాకు ఇవ్వలేదనే మాటకు కట్టుబడి ఉంటాం. మీడియా రిపోర్టుల ద్వారానే ఈ విషయం తెలిసింది." అంటున్నారు అధికారులు. అలాగే CERT-IN హ్యాకింగ్ ఉదంతంపై కూడా వాట్సాప్ తెలియచేయలేదని, అలాగే దీని ద్వారా భద్రతా పరమైన చిక్కులు ఎదుర్కున్న భారత పౌరుల వివరాలను కూడా అందించలేదని అధికారులు చెప్పారు.
అక్టోబర్ 29న ఇజ్రాయిల్ కంపెనీపై అమెరికాలో వాట్సాప్/ఫేస్‌బుక్ ఫిర్యాదు చేసినప్పుడు ఈ వివాదం మొదలుకాగా, దీనికి కొన్ని రోజుల ముందే మధ్యంతర నిబంధనలు జారీ చేసేందుకు కేంద్రానికి అనుమతి ఇస్తూ సుప్రీం ఉత్తర్వులు ఇవ్వడం గమనించాల్సిన అంశం. వాట్సాప్ సహా ఏ ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయినా సోర్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తమ ప్లాట్‌ఫాంలపై ట్రేస్ చేసే విషయం నిబంధనలు జారీ చేయడం ద్వారా, చట్టపరంగా వాట్సాప్‌ను కట్టడి చేసే విధంగా ఈ నిబంధనలు ఉంటాయని తెలుస్తోంది.
వాట్సాప్ ఏమంటుందంటే?
సెక్యూరిటీ విషయంలో తాము రాజీ పడబోమంటోంది వాట్సాప్. ఎన్‌క్రిప్షన్ విషయంలో రాజీ పడకుండా, ఇది అందించే ప్రైవసీకి భంగం కలుగకుండా ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని ఇవ్వడం అసాధ్యమన్నది వాట్సాప్ సంస్థ వాదన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com