చరిత్రను మార్చే తొలి అడుగు వేస్తున్నాం.. : సీఎం జగన్

చరిత్రను మార్చే తొలి అడుగు వేస్తున్నాం.. : సీఎం జగన్
X

ఇంగ్లీష్‌ మీడియంపై వెనక్కి తగ్గేది లేదన్నారు ఏపీ సీఎం జగన్‌. పేద పిల్లల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇంటర్మీడియట్‌పైన చదివే విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తోపాటు ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు సీఎం జగన్‌.

చరిత్రను మార్చే తొలి అడుగు వేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలులో మనబడి-నాడునేడు కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి ప్రభుత్వ బడిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొందరు పెద్ద మనుషుల పిల్లలు మాత్రమే ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారని.. కొందరు బాగుపడితే సమాజం మారదని అన్నారు. ఈ విషయంలో తనపై విమర్శలను లెక్కచేయనని జగన్ అన్నారు. ఇంగ్లీష్‌ మీడియంపై వెనక్కి తగ్గేది లేదన్నారు.

తెలుగు నుంచి ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయన్నారు సీఎం. ఇందుకోసం టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు పెడతామన్నారు. విద్యాశాఖ బడ్జెట్‌ పెంచుతామని హామీ ఇచ్చారు. జనవరి 9 నుంచి అమ్మఒడి ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. విద్యార్థుల ఉన్నత చదువులకు పూర్తి ఫీజు రీఎంబర్స్‌మెంట్, హాస్టల్‌ ఛార్జీలు చెల్లిస్తామని తెలిపారు.

మరోవైపు ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటివి 25 కేంద్రాలను అనుసంధానం చేస్తూ.. ప్రత్యేక యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Next Story