టీమిండియా ఖాతాలో మరో అరుదైన రికార్డు

టీమిండియా ఖాతాలో మరో అరుదైన రికార్డు

india

బ్యాట్స్‌మెన్‌ రఫ్పాడించారు.. బౌలర్లు విజృంభించారు.. దీంతో తొలి టెస్టు మూడ్రోజుల్లోనే ముగిసింది. మరో రికార్డు విజయం టీమిండియా ఖాతాలో పడింది. భారత్‌ దెబ్బకు బంగ్లాదేశ్‌ ఎక్కడా నిలబడలేకపోయింది. అటు ఈ విజయంతో టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో భారత్‌ నిలిచింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌ని ముచ్చటగా మూడ్రోజుల్లోనే ముగించేసింది కోహ్లీ సేన.. భారత బౌలర్లు విజృంభణతో తొలిటెస్టులో బంగ్లాదేశ్ పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ పెద్దగా రాణించలేదు.. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో 213 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది.

బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు లిటన్ దాస్ 35రన్స్‌, హసన్ 38 రన్స్‌ కాసేపు రహీమ్‌తో పాటు పరాజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రహీమ్ ఔట్ అయిన తర్వాత మిగిలిన బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే పెవిలిన్ చేరారు. భారత బౌలర్లలో షమి 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, ఉమేశ్ 2 వికెట్లు, ఇషాంత్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 493 పరుగులకు 6 వికెట్ల దగ్గరే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీకి తోడు, రహానె, జడేజా అర్థ సెంచరీలతో చెలరేగారు. ఉమేష్‌ యాదవ్‌ దూకుడుగా ఆడడంతో భారత్‌ భారీ స్కోరు సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ మన బౌలర్ల జోరు కొనసాగడంతో బంగ్లాదేశ్‌కు ఇన్నింగ్స్‌ ఓటమి తప్పలేదు.

ఈ విజయంతో భారత్‌ మరో అరుదైన రికార్డును అందుకుంది. ఇన్నింగ్స్‌ వందకుపైగా పరుగుల తేడాతో విజయం సాధించడం భారత్‌కు ఇది వరుసగా మూడోసారి. ఓవరాల్‌గా ఆరో టెస్టు విజయం. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ రెండుసార్లు ఇన్నింగ్స్ వందకుపైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. సఫారీలతో పుణెలో జరిగిన టెస్టులో కోహ్లీ సేన ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలించింది. రాంచీలో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా, బంగ్లాదేశ్‌పై ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక ఈ విజయంతో భారత్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఎవరికీ అందనంత దూరంలో నిలించింది.. టెస్టుల్లో ఇది భారత్‌కు వరుసగా ఆరో విజయం. ఇప్పటి వరకు జరిగిన ఆరు టెస్టుల్లో భారత్‌ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. టెస్టు చాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లు సాధించిన తొలి జట్టు కూడా భారతే. భారత్‌ తర్వాత న్యూజిలాండ్‌, శ్రీలంక జట్లు చెరో 60 పాయింట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story