పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కీలక బిల్లుల ఆమోదంపై దృష్టి పెట్టిన కేంద్రం

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో భేటీ జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని విపక్షాలను కోరనుంది కేంద్ర ప్రభుత్వం. సభా సమయాన్ని వృధా చేయకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేలా చూడాలని విపక్షాలకు విజ్ఞప్తి చేయనుంది. ఇక సభలో చర్చించాల్సిన అంశాలు కూడా అఖిలపక్ష సమావేశంలో చర్చకు రానున్నాయి. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన కూడా ఆల్‌పార్టీ మీట్ అవుతుంది.
మరోవైపు మధ్యాహ్నం 2 గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ, 3గంటలకు ఎన్డీయే పక్షాల భేటీ జరగనుంది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలు, విపక్షాలకు ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టేలా పార్టీ ఎంపీలకు బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేయనుంది. ఈ భేటీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
సోమవారం నుంచి డిసెంబర్ 13వరకు పార్లమెంట్ సెషన్ కొనసాగనుంది. దాదాపు 4 వారాల పాటు సాగే శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించనుండగా, ప్రజాసమస్యలపై సర్కారును ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి. గత సెషన్‌లో ట్రిపుల్ తలాఖ్, జమ్మూకశ్మీర్ విభజన బిల్లులను ఆమోదింపచేసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. పౌరసత్వ చట్ట సవరణ, ఢిల్లీలో 1728 అనధికార కాలనీల క్రమబద్దీకరణ, వ్యక్తిగత సమాచార భద్రత, కార్పొరేట్ పన్ను తగ్గింపు, కంపెనీల చట్ట సవరణ బిల్లులు ఇందులో ఉన్నాయి. వీటిలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఉభయసభల్లో హాట్ హాట్‌గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com