'ఏఎన్నార్ జాతీయ పురస్కారాల' ప్రధానం


'ఏఎన్నార్ జాతీయ పురస్కారాల' ప్రదానం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా తరలి రావడంతో కార్యక్రమం ఆద్యంతం కన్నులపండువగా సాగింది. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ అవార్డులు సినీ ప్రముఖులకు అందిస్తూ వస్తున్నారు నాగార్జున. దీంట్లో భాగంగా 2018 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని అతిలోక సుందరి శ్రీదేవికి ప్రకటించారు. దివంగత శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్ దీన్ని అందుకున్నారు. అలాగే 2019వ సంవత్సరానికి ఈ అవార్డ్‌ను ప్రముఖ నటి రేఖ అందుకున్నారు.
హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి చిరంజీవి, సుబ్బరామిరెడ్డి సహా పలువురు VIPలు హాజరయ్యారు. సినిమారంగానికి తమ సేవలతో ఎంతో గుర్తింపు తెచ్చిన వారికి ఇలా అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు నాగార్జున. ఈ పురస్కారాలు ANR ఉన్నప్పుడే ఇవ్వాలనుకున్నామని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినిమా ఉన్నన్నాళ్లూ నాగేశ్వర్రావు ఉంటారని అన్నారు. అలాగే శ్రీదేవితో పనిచేసిన రోజుల్ని కూడా గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్‌లో అగ్రస్థాయికి చేరిన శ్రీదేవి, రేఖ ఇద్దరూ తెలుగువారే కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
తెలుగులో తనకు ఓ సినిమా చేయాలని ఉందన్నారు రేఖ. త్వరలోనే ఆ కోరిక తీరుతుందని ఆశిస్తున్నానన్నారు. చిన్నప్పుడు అన్నపూర్ణా స్టూడియోలో తిరిగన రోజుల్ని రేఖ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అమ్మ కోరిక మేరకు ఓ తెలుగు సినిమా చేశానన్నారు. ANR ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నారు.
భారతీయ చలన చిత్ర రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంత గుర్తింపు ఉందో.. ఆ స్థాయి గౌరవం ANR అవార్డ్స్‌కి కూడా రావాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. అలాగే తాను తల్లి కడుపులో ఉన్నప్పుడు ANR రోజులు మారాయి సినిమాకి సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని కూడా అందరితో పంచుకున్నారు. ఆ సినిమాకి వెళ్తున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా కూడా లెక్క చేయకుండా తన తల్లి అంజనీదేవి ధియేటర్‌కు వెళ్లి అది చూసే వచ్చారని, అప్పుడు అమ్మ కడుపులో ఉన్నది తానేనని చెప్పారు. అలాగే.. ANRతోపాటు తాను చేసిన సినిమాల విశేషాలు పంచుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

