రాజ్యసభకు అరుదైన రికార్డు

పెద్దలసభ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. రాజ్యసభ 250వ సెషన్ జరుపుకుంది. 1952లో రాజ్యసభ ప్రారంభమైంది. నాటి నుంచి చట్టాల రూపకల్పనలో ఎగువసభ కీలక పాత్ర పోషించింది. తాజాగా 250వ సారి పెద్దలసభ సమావేశమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా, ఇటీవల మృతి చెందిన సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జగన్నాథ్ మిశ్రా, రాంజెఠ్మలానీ, గురుదాస్ గుప్తా, ఎస్ లిబ్రా మృతిపట్ల రాజ్యసభ సంతాపం తెలిపింది. ఇక, 250వ సెషన్‌ను పురస్కరించుకొని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. సభ విశిష్టతను సభ్యులందరికీ వివరించారు.
సమాఖ్య వ్యవస్థకు పెద్దలసభ ఆత్మవంటిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. చారిత్రక ఘట్టాలకు రాజ్యసభ సాక్ష్యంగా నిలిచిందని కొనియాడారు. ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్-370 రద్దు తదితర బిల్లుల ఆమోదంలో ఎగువసభ కీలక పాత్ర పోషించిందని కితాబిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్‌కు వచ్చారని గుర్తు చేశారు. ప్రజాసేవ చేయాలనుకునేవారికి ఎగువసభ సరైన వేదిక అన్నారు.
సమగ్ర చర్చకు రాజ్యసభే సరైన వేదిక అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఈ సభలో విపక్ష నాయకునిగా, సభా నాయకునిగా ఉండే అదృష్టం తనకు దక్కిందన్నారు. పార్లమెంట్‌లో రెండో సభ ఎందుకు ఉండాలో రాజ్యాంగసభ సభ్యుడు గోపాలస్వామి అయ్యర్ స్పష్టంగా తెలియచేశారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com