పక్కింటి అబ్బాయితో పరాచకాలా అంటూ కూతురిని..

పరువు.. మర్యాదా మంట గలుపుతావా.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు.. ఏంటి వాడితో ఆ ఇకఇకలు, పకపకలు.. పద నడువ్ లోపలికి అని తండ్రి అనే సరికి. కామ్‌గా అతడి వెనకే వచ్చింది. రెండు రోజులు పనిష్మెంట్ ఇస్తాడనుకుంది కానీ.. పర్మినెంట్‌గా జీవితమే లేకుండా చేస్తాడనుకోలేదు. కన్నతండ్రే కాలయముడయ్యాడు. పక్కింటి అబ్బాయితో ప్రేమలో పడిందని, దాంతో పరువు పోయిందని భావించిన తండ్రి 22 ఏళ్ల కుమార్తెను కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఫెరోజాబాద్ జిల్లాలో సాలేంపూర్ ఖుటియానా గ్రామానికి చెందిన హరివాన్ష్ కుమార్ అనే వ్యక్తి కుమార్తె పూజతో కలిసి నివసిస్తున్నారు.
ఓ రోజు అర్థరత్రి పూజ గజేంద్ర అనే అబ్బాయితో మాట్లాడుతూ తండ్రి కంటికి చిక్కింది. అది చూసి హరివాన్ష్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. వెంటనే కూతురి చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కొచ్చాడు. కరెంటు ప్రవహిస్తున్న విద్యుత్ తీగను లాగి ఆమెకు అంటించాడు. అంతటితో ఆగక కత్తితో కూతురి గొంతు కోసి చంపేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజ పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. నలుగురు సోదరుల మధ్య గారాబంగా పెరిగిన పూజ జీవితం తండ్రి చేతిలో బలైపోయింది. పూజ సోదరుడు యోగేశ్ తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

