విక్రమ్ ల్యాండర్ అందుకే విఫలమైంది.. ఇస్రో..


చంద్రయాన్-2లో తలెత్తిన సమస్యలకు ఇస్రో బృందం కారణాలు కనిపెట్టింది. విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో ఎందుకు విఫలమైందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఇస్రో పురోగతి సాధించింది. సాఫ్ట్‌వేర్ ప్రాబ్లెమ్ వల్లే విక్రమ్ సేఫ్‌గా ల్యాండ్ కాలేకపోయిందని ఇస్రో వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. విక్రమ్ ల్యాండింగ్ విఫలంపై లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్ వి.నారాయణ నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీకి నాసా నుంచి కూడా కొంత సమాచారం లభించింది. వివిధ కోణాల్లో పరిశీలించిన కమిటీ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను స్పేస్ కమిషన్‌కు అందజేసినట్టు సమాచారం.
చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా చంద్రయాన్-2ను డిజైన్ చేశారు. అయితే, విక్రమ్ ల్యాండర్ 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి 5 కిలోమీటర్ల వరకు సాఫీగానే చంద్రుడి వైపు ప్రయాణించింది. ఎంతో రిస్క్‌తో కూడిన ఈ దశలో కూడా ఎటువంటి లోపం తలెత్తలేదు. అయితే చివరి దశలోనే అనుకోని పరిస్థితి తలెత్తింది. చంద్రుడి ఉపరితలానికి దాదాపు 500 మీటర్ల సమీపంలో విక్రమ్ ల్యాండర్ కూలిపోయింది. చివరి నిమిషంలో ప్రమాదం జరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారు.
అయితే, రఫ్ బ్రేకింగ్ దశ నుంచి ఫైన్ బ్రేకింగ్ దశకు వచ్చినప్పుడు సమస్య మొదలైంది. ఫైన్ బ్రేకింగ్‌కు ఉద్దేశించిన థ్రస్ట్‌లలో ఒక దానిని మండించి సెకన్‌కు 146 మీటర్లు ప్రయణించేలా నియంత్రించే క్రమంలో ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. దాంతో ల్యాండర్‌తో పాటు అందులో ఉన్న రోవర్ దెబ్బతిన్నాయి. అందువల్లే భూమి మీద ఉన్న కేంద్రంతో సంబంధాలు తెగిపోయినట్లుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, సాఫ్ట్ ల్యాండింగ్‌కు ఉపకరించే సాఫ్ట్‌వేర్‌లో అనుకోని ఇబ్బంది తలెత్తడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని ఇస్రో అంతర్గత కమిటీ తేల్చింది. అయితే సాఫ్ట్‌వేర్‌ను పరీక్షించిన సమయంలో ఎటువంటి లోపం కనిపించలేదని వారంటున్నారు. ఈ దర్యాప్తులో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అందించిన సమాచారాన్ని కూడా ఈ కమిటీ విశ్లేషించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

