'మహా' రాజకీయం : నేడు ఢిల్లీకి శరద్ పవార్


శివసేనతో పొత్తుకు సై అన్న కాంగ్రెస్, ఎన్సీపీ.. ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని అడుగులు వేస్తున్నాయి.. మధ్యవర్తిగా ఎన్సీపీ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతోంది.. ప్రభుత్వ ఏర్పాటుపై ముందుగానే ఒక అభిప్రాయానికి వచ్చిన ఈ మూడు పార్టీలు శనివారమే గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి.. అయితే, చివరి నిమషంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నాయి.. కూటమి పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడం వల్లే గవర్నర్‌ను కలవకపోవడానికి కారణంగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరోసారి పార్టీ కోర్ కమిటీ నేతలతో సమావేశం నిర్వహించారు. పుణెలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటులో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు.
మరోవైపు సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై కీలక చర్చలు జరిపేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే శివసేన అధినాయకత్వంతో పాటు కాంగ్రెస్ మహారాష్ట్ర నేతలతోనూ, జాతీయ స్థాయి నేతలతోనూ పవార్ చర్చలు జరిపారు. ఈరోజు ఢిల్లీలో సోనియాతో సమావేశం అవుతారు. శివసేన నాయకత్వంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అయితే, ఇదే సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకుంటారా..? లేక మరోమారు మూడు పార్టీల నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారా అనేదానిపై క్లారిటీ లేదు. సోనియాతో సమావేశం తర్వాత రేపు రెండు పార్టీల మధ్య పదవుల పంపకంపై చర్చలు జరుగుతాయని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు.
ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి పార్టీలు పార్టీలు పావులు కదుపుతుంటే.. బీజేపీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది.. బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పాటవ్వాలనే విషయంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాందాస్ అథావలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అంతా సవ్యంగానే సాగుతోందని, బీజేపీ-శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని అమిత్‌షా చెప్పినట్లుగా అథవాలే మీడియాకు వివరించారు.
మొత్తంగా మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభనకు ఇప్పట్లో తెరపడేలా లేదు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? లేక కేంద్ర మంత్రి చెబుతున్నట్టుగా బీజేపీ-శివసేన ప్రభుత్వం ఏర్పడుతుందా..? అనేది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

