శ్రీలంక నూతన అధ్యక్షుడి సక్సెస్‌కు కారణం అదేనా?

శ్రీలంక నూతన అధ్యక్షుడి సక్సెస్‌కు కారణం అదేనా?

Sri-Lankan-president

శ్రీలంక నూతన అధ్యక్షునిగా గోటబయ రాజపక్స ఎన్నికయ్యారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో సాజిత్ ప్రేమదాసపై గోటబయ విజయం సాధించారు. సింహళీయులు మెజార్టీగా ఉన్న ప్రాంతాల్లో రాజపక్సకు ఆధిక్యం లభించగా, తమిళులు అధికంగా ఉన్న ఏరియాల్లో ప్రేమదాసకు మెజార్టీ లభించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో ప్రేమదాసను రాజపక్స ఓడించారు. గోటబయ రాజపక్సకు సుమారు 53 శాతం ఓట్లు రాగా, సాజిత్ ప్రేమదాసకు సుమారు 45 శాతం ఓట్లు వచ్చాయి. విజయం సాధించిన రాజపక్సకు ప్రేమదాస అభినందనలు తెలిపారు.

గోటబయ రాజపక్స, శ్రీలంకకు రెండు సార్లు అధ్యక్షునిగా పని చేసిన మహీంద్ర రాజపక్స సోదరుడు. రక్షణశాఖ మాజీ కార్యదర్శిగా పని చేశారు. వివాదాస్పద నాయకునిగా కూడా పేరు పొందారు. 2008-09లో తమిళ వేర్పాటువాద గెరిల్లాలతో జరిగిన తుది విడత పోరులో తీవ్రమైన యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ గోటబయపై ఆరోపణలు వచ్చాయి. చైనా అనుకూలవాదిగా, అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న నాయకునిగా గోటబయ రాజపక్సకు పేరుంది. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు. శ్రీలంక పోడుజన పెరమున అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో సింహళీయులు, జాతీయతావాదాన్ని బలంగా ప్రస్తావించారు. మెజారిటీ కమ్యూనిటీగా ఉన్న సింహళీయుల అభిమానాన్ని సాధించడంలో సక్సెస్ అయ్యారు.

ఏప్రిల్‌లో భీకరమైన తీవ్రవాద దాడి అనంతరం శ్రీలంకలో జరిగిన మొదటి ఎన్నికలివే. ఈస్టర్ పర్వదినం రోజు జరిగిన ఆత్మాహుతి దాడుల్లో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. నిఘా వర్గాలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శలు వచ్చాయి. ఇది రణిల్ విక్రమసింఘే ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చిపెట్టడమే కాకుండా తాజా ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వంపై ప్రజాగ్రహాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజపక్స సక్సెస్ అయ్యారు. ఈ ఎలక్షన్లలో దేశంలోని బౌద్ధ సింహళీయుల మద్దతును రాజపక్స పొందగలిగారు.

గోటబయ రాజపక్సను అభిమానులు ముద్దుగా టర్మినేటర్ అని పిలుచుకుంటారు. ఎల్‌టీటీఈ నిర్మూలనలో కీలకపాత్ర పోషించారు. 2009లో ఎల్‌టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించారు. దాంతో ఆయన జాతీయ హీరోగా నీరాజనాలు అందుకున్నారు. ఇప్పుడు టర్మినేటరే దేశాధ్యక్షుడు కావడంతో దేశ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. కొన్నేళ్లుగా శ్రీలంకలో ఆర్థికాభివృద్ధి మందగించింది. నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాజపక్సపై పడింది. 22 మిలియన్ల మంది భవిష్యత్తును కాపాడాతానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని రాజపక్స ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story