వైసీపీ దాడులతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు : చంద్రబాబు

టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. 6 నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌లతో తణుకులో సమావేశమై పార్టీ పటిష్టతపై పలు సూచనలు చేశారు. వైసీపీ దాడులతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
పార్టీ పటిష్టతపై ఫోకస్ చేసిన చంద్రబాబు.. తణుకులోని ఆరు నియోజకవర్గ ఇంఛార్జులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు, నర్సాపురం, ఆచంట.. నియోజకవర్గాల నేతలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చించి.. క్యాడర్‌కు ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా దిశానిర్దేశం చేశారు.
పోలీసు 30 యాక్టు పేరుతో టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమంగా నోటీసులు ఇస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై 13 కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసులపై జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాను ప్రశాంతంగానే ఉండనీయాలని వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు చంద్రబాబు. టీడీపీ కార్యకర్తల బాధ, ఆవేదన చూస్తుంటే రాజకీయ కక్ష ఏ స్థాయికి వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తలపై సంబంధం లేకుండా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుందని వైసీపీ గుర్తుంచుకోవాలన్నారు. టీడీపికి రౌడీ రాజకీయాలు చేయడం రాదని.. పోలీసులు అధికారులు ఉద్యోగ భద్రత కోసం తప్పుడు పనులు చేయొద్దని సూచించారు.
అయ్యప్ప మాలలు వేసుకుని బూతులు తిట్టే పరిస్థితికి మంత్రులు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో తన కాన్వాయ్‌కి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. టీడీపీకి మద్దతు తెలిపిన ప్రజాసంఘాల నేతలపైనా కేసులు పెట్టడం దారుణమన్నారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com