ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమావేశంలో భిన్నాభిప్రాయాలు

ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమావేశంలో భిన్నాభిప్రాయాలు

rtc-jac

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 47వ రోజుకు చేరుకుంది. 26 డిమాండ్లతో సమ్మె ప్రారంభమైనా.. చివరికి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ వదిలేసి మిగిలిన అంశాలపై చర్చకు పిలవాల్సిందిగా కోరింది ఆర్టీసీ జేఏసీ. అయితే..ప్రభుత్వం మాత్రం విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నట్లుగా వ్యవహరించింది. అఫిడవిట్ల మీద అఫిడవిట్లు ఇస్తూ సమ్మె డిమాండ్లను నెరవేర్చలేమని తేల్చిచెప్పేసింది. దీంతో సమ్మె కొనసాగించాలా? వద్దా? అనేది డైలామాలో పడింది ఆర్టీసీ జేఏసీ. 48 వేల కార్మికుల కుటుంబాలకు సంబంధించిన అంశం కావటంతో అందరి అభిప్రాయం మేరకే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. సమ్మె కొనసాగింపుపై మంగళవారం చర్చోపచర్చలు చేపట్టింది ఆర్టీసీ జేఏసీ.

సమ్మెపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు యూనియన్లు, డిపోల వారీగా కార్మికులు వేర్వేరుగా సమావేశం అయ్యారు. కార్మికుల అభిప్రాయాల సేకరణ తర్వాత సమ్మె యథావిధిగా కొనసాగించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ్టి హైకోర్టు విచారణ తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు.

సమ్మె కొనసాగింపు నిర్ణయానికి ముందు యూనియన్ల వారీగా జరిగిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. 46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు? కోర్టులు ఏం చెప్పాయి? అన్నది అంశాల వారీగా చర్చించారు. అయితే..ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు లేబర్ కోర్టులో మరింత ఆలస్యం జరుగుందని ఆందోళనలో ఉన్నారు.

అటు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బ్యాలెట్‌ పెట్టి అభిప్రాయాలు తీసుకోవాలని కార్మికులు కోరారు. ఇలా డిపోల నుంచి కార్మికుల అభిప్రాయలు తీసుకున్న తరువాత.. జేఏసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమై సమ్మె ప్రకటన చేశారు.

ఫైనల్ మెజారిటీ వర్గం కార్మికులు మాత్రం ఎన్ని రోజులు అయినా సమ్మె కొనసాగించాల్సిందేనని నిర్ణయానికి వచ్చారు. భేషరతుగా సమ్మెను విరమిస్తే ఉద్యోగభద్రత ఉంటుందా? తిరిగి విధుల్లోకి తీసుకుంటారా? అని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికులు జేఏసీ దృష్టికి తీసుకొచ్చారు. జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story