పెళ్లై వారం.. అంతలోనే విషాదం..

పెళ్లై వారం.. అంతలోనే విషాదం..
X

honeymoon

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.. ఆ జంటను చూసి విధికి అప్పుడే కన్నుకుట్టిందో ఏమో.. అతడిని దూరం చేసింది.. ఆమెను ఒంటరిని చేసింది. చెన్నై అమింజికరై తిరువీధి అమ్మన్ ఆలయం వీధికి చెందిన అరవింద్, ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్ కోసమని హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమని తాము మరిచిపోయారు. డోబీ ప్రాంతలోని అందాలను వీక్షిస్తుండగా అక్కడ ప్యారాగ్లైండింగ్ జరగడాన్ని చూశారు. అది చూడగానే అరవింద్‌కి కూడా ప్యారాగ్లైండింగ్ చేయాలనిపించింది.

భార్య ప్రీతి భయపడుతున్నా ఆమెని ఒప్పించి అతను ఒక్కడే పైలట్ సాయంతో ఆకాశంలో విహరించాడు. అనంతరం కొద్దిసేపటికే అరవింద్ అనంత లోకాలకు వెళ్లిపోయాడు. అరవింద్ నడుముకు కట్టుకున్న బెల్ట్ విడిపోయింది. దీంతో అంత ఎత్తుమీద నుంచి ఒక్కసారిగా అరవింద్ కింద పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే అతడు మృతి చెందాడు. ఆ సమయంలో అత్యవసరంగా క్రిందకు దిగిన పైలట్ హరూరామ్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో షాక్ తిన్న ప్రీతి అక్కడే కుప్పకూలిపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను దగ్గరలోని కులు ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసుల విచారణలో నడుముకు బెల్టును సరిగా కట్టుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణైంది.

Next Story