సమ్మెకు ఎండ్ కార్డ్ పడింది.. మరీ.. ప్రభుత్వ నిర్ణయం?

సమ్మెకు ఎండ్ కార్డ్ పడింది.. మరీ.. ప్రభుత్వ నిర్ణయం?

tsrtc

47 రోజులుగా సమ్మె చేస్తున్నతెలంగాణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అన్నిజిల్లాలు, డిపోల వారీగా కార్మికులు అభిప్రాయాలు తీసుకున్న నేతలు.. మెజార్టీ నిర్ణయం మేరకు సమ్మెను విరమించాలని నిర్ణయించారు. తమ సమస్యకు లేబర్‌కోర్టులో న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠను రేపుతోంది.

ఆర్టీసీ సమ్మె.. భవిష్యత్ కార్యాచరణపై రెండు రోజులుగా విస్తృతంగా చర్చించారు జేఏసీ నేతలు. మంగళవారం అన్నిజిల్లాలు, డిపోలు, యూనియన్ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పలుచోట్ల సీక్రెట్ పోలింగ్‌ కూడా నిర్వహించారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం జరిగింది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, థామస్ రెడ్డి సహా 16 మంది జేఏసీ నేతలు హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ కీలక ప్రకటన చేశారు.

ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ప్రకటించారు అశ్వత్థామరెడ్డి. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు. ఈ దిశగా సత్వరమే చర్య తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని తెలిపారు. లేబర్ కోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా ఈ తీర్పును గౌరవించాలని కోరారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు అశ్వాత్థామరెడ్డి.

విధుల్లో చేరే కార్మికులపై చర్యలు తీసుకుంటామన్నా.. ఎలాంటి పేపర్లపై సంతకాలు పెట్టమన్నా.. అందుకు ఒప్పుకునేది లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు.. 20కిపైగా ప్రధాన డిమాండ్లతో ఆక్టోబర్‌4 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు కార్మికులు. సంస్థ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఏకంగా 47 రోజులపాటు విధుల్ని బహిష్కరించారు. మధ్యలో పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. ప్రభుత్వం త్రిసభ్య కమిటీ కూడా వేసింది. అయితే ఈ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం రెండు సార్లు కార్మికులకు డెడ్‌లైన్లు విధించింది. విధుల్లో చేరకపోతే సెల్ఫ్ డిస్మిస్ అయినట్లేనని ప్రకటించింది. అయినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. సమ్మెను కొనసాగించారు.

ఆ తర్వాత విషయం హైకోర్టుకు చేరింది. సమ్మపై అటు కార్మిక సంఘాలు, ఇటు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎవరి వాదనలు వాళ్లు వినిపించారు. సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున కార్మికుల డిమాండ్లు తీర్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది ప్రభుత్వం. అటు సంస్థ నష్టాలకు తాము కారణం కాదంటూ కార్మిక సంఘాలు వాదించాయి. అటు ఈ 47 రోజులుగా ఎదో ఒక రూపంలో ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు కార్మికులు. ఛలో ట్యాంక్‌బండ్ కూడా నిర్వహించారు.

ఇలా 47 రోజుల పాటు అనేక మలుపులు తిరిగింది ఆర్టీసీ సమ్మె. గతంలో కూడా ఆర్టీసీలో అనేక సార్లు సమ్మె చేశారు. అయితే ఏకంగా 47 రోజుల పాటు విధుల్ని బహిష్కరించడం ఇదే తొలిసారి.

Tags

Read MoreRead Less
Next Story