ప‌ద‌వి కోల్పోనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే?

ప‌ద‌వి కోల్పోనున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే?

trs-mla

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ భారతీయుడు కాదంటూ బుధవారం తేల్చిచెప్పింది కేంద్ర హోంశాఖ. ఆయన మోసపూరితంగా భారత పౌరసత్వం పొందారని స్పష్టం చేసింది. పౌరసత్వం రద్దు చేస్తూ 13 పేజీల ఉత్తర్వులిచ్చింది. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరిత విధానాల ద్వారా సిటిజన్‌షిప్ పొందారని.. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని తెలిపింది. తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ చెన్నమనేని అఫిడవిట్ లో పేర్కొనడంపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టు తలుపు తట్టారు రమేష్. కేంద్ర ఆదేశాలను కొట్టివేయాలంటూ పిటిషన్‌ వేశారు.

చెన్నమనేని రమేష్ ప్రత్యర్థి అయిన ఆది శ్రీనివాస్ కూడా హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. చెన్నమనేని కోర్టును ఆశ్రయిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. రమేష్ భారత పౌరుడు కాదని, మోసపూరిత పత్రాలతో పౌరసత్వం పొందాడని గత పది సంవత్సరాలుగా చెబుతునే ఉన్నానని అన్నారు. చెన్నమనేని భారత దేశ చట్టాలను ఏ విధంగా ఉల్లంఘించారో చెప్పాలనే లక్ష్యంతోనే కేవియట్ దాఖలు చేశామన్నారు ఆది శ్రీనివాస్.

2009లో వేములవాడ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు చెన్నమనేని రమేశ్‌. అప్పటినుంచీ ఆయన పౌరసత్వంపై వివాదం రగులుతూనే ఉంది. జర్మనీ దేశస్తురాలిని వివాహం చేసుకోవడంతో పాటు.. ఆ దేశ పౌరసత్వాన్ని పొందారన్నది రమేష్ బాబుపై ఉన్న ఆరోపణ. ఎన్నికల్లో పోటీ చేసే ముందు భారతదేశ పౌరసత్వాన్ని తిరిగిపొందడానికి.. నిబంధనలు పాటించకుండా తప్పుడు ధృవపత్రాలను సమర్పించారన్న అభియోగాలు వచ్చాయి. 2009లోనే ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.

2013లో ఎమ్మెల్యే రమేష్ బాబుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది హైకోర్టు. 2017లో హోంశాఖ ఆయన పౌరసత్వాన్ని రద్దుచేసింది. దీన్ని సవాల్ చేస్తూ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖేనని స్పష్టం చేస్తూ ఈ ఏడాది జులైలో ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. ఈ ఆదేశాలతో 2019 అక్టోబర్ 31న ఇరు పక్షాలు తమ వాదనలను హోంశాఖ మందు వినిపించాయి. బుధవారం రమేష్ బాబు పౌరసత్వం రద్దు చేస్తూ 13 పేజీల ఉత్తర్వులిచ్చింది హోంశాఖ. ఈ ఆదేశాలతో చెన్నమనేని ఎమ్మెల్యే పదవిని కోల్పేయే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story