వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన జగన్
X

ys-jagan

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్‌. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. మత్స్యకార కుటుంబాల్లో సంతోషం నింపడం కోసం దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు సీఎం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షా 35 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించినట్ల తెలిపారు జగన్.

సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే YSR మత్స్యకార భరోసా కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు సీఎం. తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఎంతమంది శత్రువులు కుట్ర పన్నినా.. వారందరినీ ఎదుర్కొనే శక్తి ఉందన్నారు.

కచ్చులురు వద్ద ప్రమాదానికి గురైన బోటును వెలిసి తీసిన ధర్మాడి సత్యంను సీఎం జగన్ సన్మానించారు. బోటు వెలికి తీసినందుకు అభినందించారు. పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ వారధిని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags

Next Story