ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారు!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి పేరును ఉమెన్ చాందీ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయమై ఢిల్లీ రావాలని పిలుపు వచ్చినట్లుగా సమాచారం. అయితే, పీసీసీ పదవి పట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి అంత సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. అధిష్ఠానికి కారణాలు వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు.. ఒకవేళ కిరణ్‌కుమార్ రెడ్డి కాదంటే ప్రత్యామ్నాయంగా పళ్లంరాజు పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఆదరణ రాకపోవటంతో గతేడాదే తిరిగి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి పార్టీలో ఏ పదవి లేకుండా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాల్లో ఉంది పార్టీ అధిష్టానం. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి రాజీనామా తర్వాత ఇప్పటి వరకు కొత్త ఏపీకి పీసీసీ చీఫ్ లేడు. దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళనలో పడిన కాంగ్రెస్.. ఏపీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్ రెడ్డిని దాదాపుగా ఫైనల్ చేసింది. అయితే..ఆయన ఈ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం ఆయన్ని కన్వీన్స్ చేసి పార్టీ బాధ్యతలు అప్పగిస్తుందా? లేదంటే తర్వాతి రేసులో ఉన్న పళ్లంరాజు వైపు మొగ్గు చూపుతుందా? అనేది తేలాల్సి ఉంది.
కిరణ్ కుమార్ రెడ్డి తరిగి కాంగ్రెస్ లో చేరి ఏడాదిన్నర అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పార్టీలో ఏ పదవి చేపట్టకుండా ఖాళీగానే ఉన్నారు. ఈ సమయంలో పార్టీ పగ్గాలే చేతికి అందివస్తుంటే ఆయన ఎందుకు కాదంటున్నారనేది ఆసక్తిగా మారింది. దీనిపై పొలిటికల్ గా వేర్వేరు ప్రచారాలు జరుగుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అందువల్లే ఆయన అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ను లైట్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com