ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైన సీఎం కేసీఆర్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమైన సీఎం కేసీఆర్

167447-kcr

ఆర్టీసీపై ప్రగతిభవన్‌లో కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ఆర్టీసీకి ఎంతో కొంత డబ్బులిచ్చి తాత్కాలికంగా ఆదుకోవడం కంటే దానికి శాశ్వత పరిష్కారం చూపడమే మార్గమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సంస్థను యథాతథంగా నడపాలంటే నెలకు 640 కోట్లకుపైగా భారాన్ని మోసే శక్తి ఇటు ఆర్టీసికి కానీ, ప్రభుత్వానికి గానీ లేదని భావిస్తున్నారు. అందుకే శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేసీఆర్ సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతోపాటు సీఎస్, ఇతర ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల్ని అందించడమే ప్రథమ కర్తవ్యంగా ఆర్టీసీ సమస్యకు పర్మినెంట్‌ సొల్యూషన్‌ చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. రూట్ల ప్రైవేట్‌పై ఇవాళ్టి కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే కీలక నిర్ణయం తీసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు.

ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు 2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే 240 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వం భావిస్తోంది. సిసిఎస్ కు 500 కోట్ల రూపాయలుతోపాటు డీజిల్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉంది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాల్సి ఉంది. పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు 65-70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్ల రూపాయలు కావాలనే అభిప్రాయం సిఎం సమీక్షలో వ్యక్తమైంది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీని ఎప్పటిలాగా యథావిధిగా నడపడం అసాధ్యమని భావిస్తున్నారు. రూట్ల ప్రైవేటీకరణపై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అప్పుడు అన్ని అంశాలను పరిగనణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు.

కేసీఆర్ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో ఆర్టీసీ కార్మికులకు ఇంకా నిరీక్షణ తప్పేలా లేదు. పైగా తాను తీసుకొచ్చే మార్పులకు అంగీకరిస్తేనే ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చే విషయంలో సర్కార్ నిక్కచ్చిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఆర్టీసీని ప్రక్షాళన చేయాలనే ఆలోచనలో ఉంది. కార్మికులను విధుల్లోకి తీసుకునే అంశంపై ఇవాళ్టీ తీర్పు తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story