ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

bus

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాఖలైన రిట్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అంతకుముందు ఇదే అంశంపై కోర్టులో వాడివేడి వాదనలు కొనసాగాయి. ప్రైవేటీకరణ ప్రక్రియను అమలు చేసే బాధ్యతను ఎవరికి ఇచ్చారని ప్రశ్నించింది హైకోర్టు. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్లు కేబినెట్‌ తీర్మానంలో పేర్కొన్నారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రభుత్వం వేరు.. అథారిటీ వేరని.. అలాంటప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పనిని అథారిటీకి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించింది. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ప్రక్రియను నిర్వహిస్తారని అడ్వకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. అయితే కేబినెట్ తీర్మానంలో అలా లేదు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు.. ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినేట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ.. ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ సంస్థతోపాటు.. కార్మికులకు నష్టం కలుగుతుందంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై పలుదఫాలుగా విచారణ జరిపింది హైకోర్టు. విచారణ సందర్భంగా గతంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచం గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ కాలంలో ఉందని అభిప్రాయపడింది. ఏవియేషన్ రంగంలో ఒకప్పుడు ఎయిర్ ఇండియా మాత్రమే ఉండేదని.. ప్రైవేట్ సంస్థలకు తలుపులు తెరిచాకే.. అన్ని సంస్థలు విజయవంతంగా నడుస్తున్నాయని అభిప్రాయపడింది.

Tags

Next Story