ఉత్కంఠకు తెర.. మహారాష్ట్ర సీఎంగా..

నెలరోజుల ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో సరికొత్త చరిత్రకు నాంది పడింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇదే అంశంపై గతకొన్ని రోజులుగా అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయాలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్-ఎన్సీపీ అంగీకారం తెలిపాయి. శనివారం మూడు పార్టీల నేతలు ఉమ్మడి ప్రకటన చేయనున్నారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. మిత్రువులు ఉండరని అంటారు. మహారాష్ట్రలో ఇప్పుడు అక్షరాల ఇదే జరిగింది. 3 భిన్న ధ్రువాలు ఒక్కటయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సై అన్నాయి. సిద్ధాంతరాద్ధాంతాలను పక్కన పెట్టేశాయి. మహారాష్ట్ర వికాస్ అఘాడిగా ఏర్పడ్డాయి. సీఎం, డిప్యూటీ సీఎం,మంత్రి పదవులు , ఉమ్మడి ప్రణాళిక తదితర అంశాలన్నింటిపైనా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు దక్కనున్నాయి. ముంబైలో సమావేశమైన మూడు పార్టీల ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. శనివారం తమ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. తాజా పరిణామాలతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
గత రెండు రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు శుక్రవారం మళ్లీ ముంబయికి మారాయి. 3 పార్టీల నేతలు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ముంబయిలోని మాతోశ్రీలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు ఉద్దవ్ ఠాక్రే. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు.. ముంబయి విడిచివెళ్లొద్దని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అటు ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు సీఎంగా ఉద్దవ్ ఠాక్రే, లేదా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేనే ఉండాలని అభిప్రాయపడ్డారు. అటు కాంగ్రెస్-ఎన్సీపీ ఎమ్మెల్యేలు నారిమన్ పాయింట్‌లోని ఓ రిసార్టులో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, పదవుల పంపకం, ఉమ్మడి ప్రణాళికలపై చర్చించారు. తర్వాత 3 పార్టీల నేతలు సాయంత్రం మరోసారి భేటీ అయ్యారు.. ఈ భేటీలోనే అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com