'మహా'రాజకీయంలో వీడుతున్న చిక్కులు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీ చుట్టూ తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ముంబయి కేంద్రంగా సాగుతున్నాయి. 48 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి. ముంబయిలోని మాతోశ్రీలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు ఉద్దవ్ ఠాక్రే. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు.. ముంబయి విడిచివెళ్లొద్దని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అటు ఈ సమావేశంలో మెజార్టీ సభ్యులు సీఎంగా ఉద్దవ్ ఠాక్రే, లేదా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేనే ఉండాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ఉద్దవ్ ఠాక్రే సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మాత్రం పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకే వదిలిపెట్టారు ఎమ్మెల్యేలు. అటు సంజయ్ రౌత్, ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ సావంత్ పేర్లను కూడా సీఎం పదవికి పరిశీలించినట్లు సమాచారం.
అటు కాంగ్రెస్-ఎన్సీపీ ఎమ్మెల్యేలు నారిమన్ పాయింట్‌లోని ఓ రిసార్టులో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, పదవుల పంపకం, ఉమ్మడి ప్రణాళికలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై ఎన్సీపీ కూడా పట్టుబడుతోందన్న వార్తల్ని కాంగ్రెస్ నేత మాణిక్ ఠాక్రే కొట్టిపారేశారు. సీఎం పదవి కచ్చితంగా శివసేనకే దక్కతుందని స్పష్టం చేశారు. ఈ దిశగా ఎన్సీపీ నుంచి ఎలాంటి డిమాండ్ రాలేదని తెలిపారు.
అటు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే మంత్రి పదవుల కోసం లాబీయింగ్ ప్రారంభించారని సమాచారం. గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి, తాజా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నాయకులకు పదవులు కట్టబెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 12శాఖలు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉపముఖ్యమంత్రి పదవి కూడా కాంగ్రెస్ ను వరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు ఎన్సీపీ తరఫున జయంత్ పాటిల్, నవాబ్ మాలిక్, అజిత్ పవార్, అనిల్ దేశ్ ముఖ్, సహా మరికొంత మందికి మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com