తమిళనాడులో రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి అదిరిపోయే కాంబినేషన్

తమిళనాడులో మల్టిస్టారర్ పాలిటిక్స్ కూడా క్లాప్ పడింది. ఒకరు విలక్షణ నటనతో లోకనాయకుడయ్యాడు. మరొకరు మాస్ యాక్షన్ తో కోట్ల మంది వీరాభిమానులను సొంతం చేసుకున్న తలైవా. సినిమా స్టార్లను దైవంతో కొలుచుకునే తమిళనాట ఈ ఇద్దరు ఒక్కటైతే ఆ పొలిటికల్ పిక్చర్ ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. జయలలిత మరణం తర్వాత నెలకొన్న రాజకీయ శూన్యత భర్తీ చేయడానికి అదిరిపోయే కాంబో వస్తుందని అభిమానులు అంచనాల్లో ఉన్నారు.
తమిళ రాజకీయాల్లో ఈ ఇద్దరు ఇద్దరే. బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా..రాజకీయంగా మాత్రం ఇంకా ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నారు. కమల్ ఇప్పటికే మక్కల్ నీది మయ్యం పార్టీని పెట్టి మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఒక్క సీటు గెలవనప్పటికీ తన పార్టీని నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు తాను మద్దతిస్తే చాలు గెలుపోటములపై ప్రభావం చూపించే హిస్టరీ ఉన్న రజనీకాంత్..పార్టీ ప్రకటించే విషయంలో మాత్రం తాబేలు కన్నా మెల్లిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పెడతానంటూ హింట్ ఇచ్చినా..ఇప్పటికీ ఎటు తేల్చలేదు. అయితే..ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తమిళ ప్రజలకు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
తమిళ ప్రజల సంక్షేమం, తమిళనాడు అభివృద్ధి కాంక్షిస్తూ అవసరం అయితే రజనీకాంత్‌తో కలిసి పనిచేయడానికి తాను సిద్ధమేనని ప్రకటించారు కమల్. ఈ ఫ్రెండ్ షిప్ ఆఫర్ పై రజనీకాంత్ కూడా సానుకూలంగా స్పందించారు. కమల్‌తో పొత్తు పెట్టుకుంటే సీఎం ఎవరు అవుతారనే ప్రశ్నకు జవాబిచ్చిన రజనీ, 2021 శాసనసభ ఎన్నికల్లో మహాద్భుతం జరుగుతుందన్నారు. ఆ ఎన్నికల్లో తమిళ ప్రజలు సంచలనం సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు.
అయితే..రజనీ స్టేట్ మెంట్ పై అన్నాడీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. రజనీ, కమల్ మధ్య రాజకీయ స్నేహం అంటే పిల్లీ ఎలుక జోడీగా సెటైర్ పేల్చింది. అంతేకాదు రజనీకాంత్ చెప్పినట్లుగా 2021లో నిజంగానే అద్భుతం జరుగుతందీ కానీ, ఆ అద్భుతం తమ విజయమేనని అన్నారు సీఎం పళనిస్వామి. ఇంకా పార్టీ కూడా పెట్టనీ రజనీకాంత్ అప్పుడే అధికారం గురించి కలలు కంటున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com