మహారాష్ట్రలో మాస్టర్ గేమ్ ప్లే చేసిన బీజేపీ.. జరిగిందిలా..

మహారాష్ట్రలో మాస్టర్ గేమ్ ప్లే చేసిన బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్సీపీ లో చీలిక వర్గంతో కలిసి 2వ సారి సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. శరద్‌పవార్‌ను కాదని బీజేపీ వైపు మొగ్గు చూపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. రాత్రికి రాత్రి ఈ పరిణామాలు మారిపోవడం అటు శివసేనకు, ఇటు ఎన్సీపీ కి కూడా షాక్‌లా తగిలింది. పార్టీలో చీలిక వల్లే ఎన్సీపీ తో బీజేపీ దోస్తీ కట్టిన విషయం ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా ట్వీట్లు చూస్తేనే అర్థమవుతోంది. వారిద్దరేకాదు మిగతా బీజేపీ నేతలు కూడా అజిత్ పవార్‌కు మాత్రమే శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని బట్టి శరద్ పవార్‌కు తెలియకుండా లెక్కలు మారిపోయినట్టు స్పష్టమవుతోంది. ఇది ఎన్సీపీ నిర్ణయం కాదంటూ శరద్ పవార్ కూడా వ్యాఖ్యానించారు.
మొన్నటి ఎన్నికల్లో ఎన్సీపీ తరపున 54 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీళ్లలో 22 మంది అజిత్ వెంట నడిచినట్టు సమాచారం. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ 22 మందితో కలిపినా బలం 127 అవుతుంది. 288 సీట్లుున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 145. ఈ నంబర్ అందుకోవాలంటే బీజేపీకి ఇంకా 18 మంది కావాలి. ఈ బలాన్ని శివసేనలో చీలిక వర్గంతోనూ, స్వతంత్ర ఎమ్మెల్యేలతోనూ పూడ్చుకుని సభలో బలం నిరూపించుకోబోతోంది కమలదళం. శనివారం తెల్లవారుజామున 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ రాంనాథ్ కోవింద్ ఉత్తర్వులు ఇవ్వడం.. ఆ వెంటనే రాజ్‌భవన్‌లో కొత్త సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com