'మహా'రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కించిన అజిత్ పవార్

మహారాష్ట్రలో కమలనాథులు ఇచ్చిన షాకు నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్నారు. అజిత్ పవార్ జలక్ తో ఎన్సీపీ ఆత్మరక్షణలో పడింది. ఇది అజిత్ పవార్ వ్యక్తిగత నిర్ణయం అని.. పార్టీకి సంబంధం లేదన్న శరద్ పవార్ అందుబాటులో ఉన్న నేతలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. తమ పార్టీలో చీలిక నిజమేనని సుప్రియసూలే అన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలంతా శరద్ పవార్ నివాసానికి చేరుకున్నారు. అజిత్ వెంట ఎవరెవరు వెళుతున్నారన్న దానిపై సమీక్షిస్తున్నారు.
అటు తాజా పరిణామాలతో కాంగ్రెస్ ఖంగుతిన్నది. వెంటనే అందుబాటులో ఉన్న నేతలతో సోనియాగాంధీ మాట్లాడుతున్నారు. మహారాష్ట్ర పరిణామాలపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. శరద్ పవార్ తీరుపైనా కొందరు హస్తం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీని కలిసిన శరద్ పవార్ రహస్య ఒప్పందం చేసుకుని ఉండొచ్చని అంటున్నారు. అయితే కొందరు ఈ వాదనతో విబేధిస్తున్నారు. అజిత్ పవార్ వెన్నుపోటు అని...శరద్ పవార్ కు సంబంధం లేదని అంటున్నారు.
అటు బీజేపీ తీరుపైనా శివసేన అగ్గిమీద గుగ్గిలమవుతోంది. తమకు అధికారం దక్కకూడదన్న ఉద్దేశంతో దొడ్డిదారిలో ప్రమాణస్వీకారం చేసిందని ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్య భారతానికే మాయని మచ్చ అని సంజయ్ రౌత్ అన్నారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో శివసేన అధినేత ఉద్దావ్ సమావేశమయ్యారు. తమ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో శివసేన అప్రమత్తమైంది. తమ ఎమ్మెల్యేలను క్యాంపునకు పంపే యోచనలో ఉంది. అసంతృప్తిగా ఉన్నవారిని కూడా బుజ్జగించి.. పార్టీలో చీలిక రాకుండా జాగ్రత్తపడుతోంది.
అటు ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా బలనిరూపణపై దృష్టిపెట్టారు. 30లోగా బలం నిరూపించుకోవాలని గవర్నర్ గడువు ఇచ్చారు. దీంతో కావాల్సిన సంఖ్యాబలంపై కసరత్తు మొదలుపెట్టారు. సీనియర్ నేతలు ఫడ్నవిస్ నివాసంలో సమావేశమయ్యారు. దీనికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఉంటుందని.. స్థిరమైన పాలన ప్రజలకు అందిస్తామని బీజేపీ నేతలంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com