'మహా' రాజకీయం మరో మలుపు.. శరద్ పవార్ వద్దకు చేజారిన ఎమ్మెల్యేలు

కర్నాటకాన్ని మించి మహార్నాటకం తలపిస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ట్విస్టుల మీద ట్విస్టులతో మహా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాత్రిరాత్రే ఎన్సీపీలో చీలిక రావడం... బీజేపీకి అజిత్ పవార్ మద్దతు తెలపడం.. మీడియాకు కూడా తెలియని విధంగా రాజ్‌భవన్‌లో సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి భగ్గుమంటోంది. ఇది అప్రజాస్వామికమని మండిపడుతోంది.
అయితే ఆ తరువాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. అజిత్ పవార్‌తో వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు మళ్లీ శరద్ పవార్ దగ్గరకు చేరుకున్నారు. దీంతో నిన్నంతా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 49 మంది ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారని.. అందరూ మీటింగ్‌లో పాల్గొన్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చెబుతున్నారు. అజిత్ పవార్‌తో ఉన్న ఐదారుగురు ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఆదివారమే బలపరీక్ష నిర్వాహించాలని శివసేన-ఎన్సీపీ పట్టుబడుతోంది. మెజారిటీ లేకున్నా బీజేపీ ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రశ్నిస్తోంది. తమకు 144 మందికిపైగా ఎమ్మెల్యేల బలం ఉందని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అజిత్ పవార్ నమ్మక ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు. పార్టీ చీలిక నేపథ్యంలో అటు ఎన్సీపీ అప్రమత్తమైంది. అజిత్ పవార్‌ను ఎన్సీపీఎల్పీ నేత నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో ఎన్సీఎల్పీ నేతగా జయంత్ పాటిల్ నియమించారు.
ఎన్సీపీలో చీలిక, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఉన్న ఎమ్మెల్యేలను కమల దళం ఎక్కడ లాగేస్తుందో అన్న భయంతో కర్నాటక తరహా రిసార్ట్స్ రాజకీయాలకు తెర తీశాయి. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలను ప్రారంభించాయి. శివసేన తన ఎమ్మెల్యేలను ముంబైలో లలిత్ హోటల్‌కు తరలించగా.. ఎన్సీపీ ఎమ్మెల్యేలను రినైసన్స్ హోటల్‌కు తరలించారు. అటు కాంగ్రెస్ కూడా తన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 44 మంది ఎమ్మెల్యేను రాజస్థాన్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో తమ ఎమ్మెల్యేలు సేఫ్ గా ఉంటారని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
మరోవైపు బీజేపీకి ఫ్లోర్ టెస్ట్ పెద్ద సవాల్‌గా మారింది. అజిత్ పవార్ మద్దతు తెలపడం వరకు ఓకే.. కానీ అజిత్ పవార్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నదానిపై క్లారిటీ లేదు. తమతోనే 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని శరద్ పవార్ చెబుతున్నారు. ఈ లెక్కన అజిత్ వెంట ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా తమకు పూర్తి మెజారిటీ ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నెల 30 వరకు బలనిరూపణకు సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బల పరీక్ష జరిగితే బీజేపీ తన బలం నిరూపించుకుంటుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. మహా రాజకీయలు ఎప్పుడు ఎటు టర్న్ తీసుకుంటాయో ఎవరికి అంతు పట్టడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com