బీజేపీని డిఫెన్స్ లో పడేసే వ్యూహంలో సంకీర్ణ కూటమి..

మహారాష్ట్ర రాజకీయం సుప్రీం కోర్టుకు చేరింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ 24 గంటల్లో మహారాష్ట్రలో బల పరీక్ష జరిగేలా ఆదేశాలివ్వాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. శనివారం రాత్రే అత్యవసర విచారణ చేపట్టాలని కోరాయి. అయితే కోర్టు అందుకు అంగీకరించలేదు. మూడు పార్టీల పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం కోర్టు... ఈ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విచారణ చేపట్టనుంది. ముగ్గురు జడ్జిల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
బీజేపీకి తమ ఎమ్మెల్యేలు దొరక్కుండా పకడ్బందీగా క్యాంప్ పాలిటిక్స్ చేస్తూనే మరోవైపు బీజేపీని డిఫెన్స్ లో పడేసే వ్యూహంలో ఉంది సంకీర్ణ కూటమి. మెజారిటీ ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని నిర్ధారణకు వచ్చాక నిన్న సాయంత్రం కౌంటర్ ట్విస్ట్ ఇచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి.
బీజేపీకి అసలు బలమే లేదంటున్న సంకీర్ణ కూటమి..సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా వస్తే ఫడ్నవిస్ ఓడిపోవటం ఖాయమని అంటోంది. అయితే..బీజేపీ మాత్రం తమకు పూర్తి మెజారిటీ ఉందని అంటోంది.
సుప్రీం తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే ఫడ్నవిస్ ఎలా గండం గట్టెక్కుతారన్నది ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com