కనులపండువగా ఆది దంపతుల కళ్యాణోత్సవం

కనులపండువగా ఆది దంపతుల కళ్యాణోత్సవం
X

shiva-parvathula-kalyanam-2

పెళ్లిమండపంలో దివ్యాలంకారభూషితుడైన శివయ్య.. పక్కన సిగ్గులొలుకుతూ అపర్ణ. ఆ రుద్రుడే వరుడు. జగజ్జనని పార్వతీదేవి వధువు. ఆకాశమంత పందిరి. భూదేవంత అరుగు. ఆది దంపతుల కళ్యాణోత్సవం కర్నాటకలోని దావణగెరెలో అత్యంత వైభవంగా జరిగింది. లయకారుడు వరుడై పెళ్లిపీటలు ఎక్కగా.. లోకమాత పార్వతీదేవి వధువుగా పెళ్లిమంటపానికి చేరగా.. వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు సాగించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో దావణగెరె ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. లోక కళ్యాణం కోసం టీవీ5-హిందూధర్మం ఛానళ్లు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఇసుకేస్తే రాలనంతగా తరలివచ్చిన భక్తకోటి సమక్షంలో..కళ్యాణ క్రతువు ఆద్యంతం కమనీయంగా సాగింది.

సాక్షాత్తు బ్రహ్మ దేవుడే పురోహితుడు.. నారాయణుడే కన్యాదాత.. పంచ భూతాలు, అష్టదిక్పాలకులు, దేవతలంతా ఆశీర్వచన జల్లులు కురిపిస్తుండగా, పార్వతీదేవిని పరమశివుడు పరిణయమాడాడు.

కర్నాటక రాష్ట్రంలో హైందవధర్మం, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ప్రాంతాల్లో దావణగెరెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్‌లో జరిగింది శివపార్వతుల కళ్యాణం. మంత్రోచ్ఛారణల మధ్య.. శైలపుత్రి మెడలో మూడు ముళ్లు వేశాడు శివయ్య.

ముక్కోటి దేవతలు బంధుమిత్రులై తరలివచ్చిన కమనీయ వేడుక. దావణగెరె మదిమదిలో నిలిచిన అపురూప దృశ్యాలు. లక్షలాది మంది భక్తుల మధ్య.. కోట్లాది మంది వీక్షకుల మధ్య సాగిందీ లోక కళ్యాణం. కైలాసనాథుడే దిగివచ్చి పార్వతీదేవిని పరిణయమాడిన ఆధ్యాత్మికోత్సవం.. భక్తకోటికి జన్మజన్మల పుణ్యాన్ని ప్రసాదించింది.

కార్తికమాస శివరాత్రి పుణ్య సమయంలో.. ముక్కంటికి అత్యంత ప్రీతికరమైన ప్రదోష కాలంలో.. పెళ్లి తంతు మొదలైంది. వేద పండితులు శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు. పెళ్లివేడుకలోని ప్రతి ఘట్టాన్ని పామరులకు సైతం అర్థమయ్యేలా వివరించారు.

కర్నాటక సీఎం యడియూరప్ప, పలువురు మంత్రులతోపాటు, శ్రీ ఉజ్జయని మఠాదీశులు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిలుగా హాజరయ్యారు. సుత్తూరు శ్రీ క్షేత్ర మహాసంస్థానాదీశులు, ఆదిచుంచెనగిరి మహాసంస్థాన పీఠాధీశులు, శ్రీక్షేత్ర బాళెహొన్నూరు ఖాసా శాఖ మఠాధిపతి కూడా ఈ కల్యాణోత్సవంలో పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. టీవీ5 గ్రూపు సంస్థల ఛైర్మన్ బి.ఆర్. నాయుడు సీఎం యడియూరప్పను ఘనంగా సన్మానించారు.

ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం.. కార్తీకం. పరమ శివుడు జ్యోతి రూపంగా పూజలందుకునే కాలం ఇది. కార్తీక మాసంలో ముక్కంటిని ఆరాధించినా, అర్చించినా, దర్శించినా, ఆదిదంపతుల కళ్యాణోత్సవం తిలకించినా కోటి జన్మల పుణ్యఫలం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే విశ్వమానవ కళ్యాణం కోసం ఏడేళ్లుగా కార్తీక మాసశివరాత్రి వేళ కళ్యాణోత్సవం వైభవంగా జరిపిస్తోంది టీవీ5.

2013, 2014లలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ శివపార్వతుల కళ్యాణం జరగ్గా, 2015లో గుంటూరు ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి వేదికైంది. 2016లో రాజమండ్రి వేదికగా జగత్ కళ్యాణం జరిగితే, 2017లో ఏకశిలానగరం వరంగల్‌ ఆతిథ్యమిచ్చింది. 2018లో కర్నూలు నగరంలో నిర్వహిస్తే.. ఇప్పుడు దావణగెరెలో జరిగింది.

ఎన్నో గ్రంథాల్లో చూసి ఉంటాం.. ఎన్నో పురాణాల్లో విని వుంటాం. కానీ, ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగితే నిజంగా జన్మ ధన్యమైనట్టే. ఆ బృహత్‌ కార్యాన్ని టీవీ5-హిందూధర్మ చానళ్లు స్వీకరించాయి. భక్తులకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని కల్పించాలన్నదే లక్ష్యం. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలన్న సంకల్పం. అణువణువూ ఆధ్యాత్మిక పరవశం.

కార్తీకమాసంలో శివ నామస్మరణే సకల పుణ్యాలు ప్రసాదిస్తుంది. అలాంటిది పంచాక్షరీ మంత్ర ఘోష మధ్య.. వేద మంత్రాల సాక్షిగా.. సాగిన ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవం.. ప్రత్యక్షంగా తిలకించిన వారికి, టీవీ తెరలపై వీక్షించిన వారికి ఇంకెంతటి ఫలితాన్నిస్తుందో చెప్పనవసం లేదు. ఇంతటి మహోత్కృష్ణ కార్యక్రమం ఆద్యంతం కమనీయంగా సాగింది. శివయ్య భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది.

శివపార్వతుల కళ్యాణం తర్వాత భక్తులకు పూజాప్రసాదాలు అందించారు. ఇందుకోసం గోకర్ణక్షేత్రం నుంచి లడ్డూలు, అక్షింతలు తెప్పించారు. హరిద్వార్‌ నుంచి గంగాజలం, నేపాల్‌లోని పశుపతినాథ్‌ టెంపుల్‌ నుంచి రుద్రాక్షలు తీసుకొచ్చారు. శివయ్య ప్రసాదాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో స్వీకరించారు భక్తకోటి.

Tags

Next Story