త్రిలోకనాథుడు వరుడిగా, జగజ్జనని వధువుగా కల్యాణోత్సవం

పరమ పవిత్రమైన కార్తీకమాసంలో కర్నాటకలోని దావణగెరెలో ఆదివారం సాయంత్రం జరగనున్న శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కైలాశమే భువికి దిగివచ్చిందా అన్నట్టుగా ఏర్పాటు చేసిన మంటపంపై ఆదిదంపతుల కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. త్రిలోకనాధుడు వరుడుగా, జగజ్జనని వధువుగా సాయంత్రం జరిగే పరిణయోత్సవంలో ప్రతి ఘట్టానికీ ఓ విశేషం ఉంది. అవన్నీ చక్కగా భక్తులకు వివరిస్తూ వేదపండితులు ఈ కల్యాణం జరిపించబోతున్నారు. ఈ ఆధ్యాత్మికోత్సవాన్ని కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని భక్త కోటి కోసం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది టీవీ5 నెట్‌వర్క్. కర్నాటక రాష్ట్రంలో హైందవధర్మం, ఆధ్యాత్మికత వెల్లివిరిసే ప్రాంతాల్లో దావణగెరెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ శ్రీ శివపార్వతుల కల్యాణం జరిపించాలని టీవీ5 యాజమాన్యం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు ఇవ్వకుండా చూస్తోంది.
కర్నాటక సీఎం యడ్యూరప్పతోపాటు, శ్రీ ఉజ్జయని మఠాదీశులు కూడా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే సుత్తూరు శ్రీ క్షేత్ర మహాసంస్థానాదీశులు, ఆదిచుంచెనగిరి మహాసంస్థాన పీఠాధీశులు, శ్రీక్షేత్ర బాళెహొన్నూరు ఖాసా శాఖ మఠాధిపతి కూడా ఈ కల్యాణోత్సవంలో పాల్గొని భక్తులకు అనుగ్రహభాషణం చేయనున్నారు. ఓ పక్క శోభాయాత్ర, మరోపక్క వేదికపై జరిగే సాంస్కృతి కార్యక్రమాలు.. ఆ తర్వాత ప్రదోషవేళలో మొదలయ్యే కల్యాణోత్సవాన్ని టీవీ5 తెలుగు, టీవీ5 కన్నడ, హిందూ ధర్మం ఛానెళ్లలో లైవ్‌లో వీక్షించవచ్చు.
ఆరేళ్లుగా కార్తీక మాసశివరాత్రి వేళ కళ్యాణోత్సవం వైభవంగా జరిపిస్తోంది టీవీ5. ఈసారి కర్నాటకలోని దావణగెరెలో కళ్యాణోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగబోతోంది. 2013, 2014లలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ శివపార్వతుల కళ్యాణం జరగ్గా, 2015లో గుంటూరు ఆదిదంపతుల కళ్యాణోత్సవానికి వేదికైంది. 2016లో రాజమండ్రి వేదికగా జగత్ కళ్యాణం జరిగితే, 2017లో ఏకశిలానగరం వరంగల్ ఆతిథ్యమిచ్చింది. 2018లో కర్నూలు నగరంలో నిర్వహిస్తే.. ఇప్పుడు దావణగెరెలో జరగబోతోంది.
సాక్షాత్తు బ్రహ్మ దేవుడే పురోహితుడిగా.. నారాయణుడే కన్యాదాతగా.. పంచ భూతాలు, అష్టదిక్పాలకులు, దేవతలంతా ఆశీర్వచన జల్లులు కురిపిస్తుండగా, పార్వతీదేవిని పరమశివుడు పరిణయమాడే సందర్భం గురించి పురాణాల్లో విని వుంటాం. కానీ, ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం కలిగితే నిజంగా జన్మ ధన్యమైనట్టే. అందుకే ఈ భూకైలాశంలో భక్త కోటికి ఆ దృశ్యాన్ని సాక్షాత్కరింప చేసేందుకు టీవీ5 చేస్తున్న ఈ ప్రయత్నమే శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం. సాయంత్రం ముందుగా శోభాయాత్ర, మరోపక్క వేదికపై జరిగే సాంస్కృతి కార్యక్రమాలు.. ఆ తర్వాత ప్రదోషవేళలో మొదలయ్యే కల్యాణోత్సవాన్ని టీవీ5 తెలుగు, టీవీ5 కన్నడ, హిందూ ధర్మం ఛానెళ్లలో లైవ్‌లో వీక్షించవచ్చు.
దావణగెరె ఇప్పటికే ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. కనీవినీ ఎరుగని రీతిలో చేసిన ఏర్పాట్లు ఇప్పటికే భక్తకోటిలో ఆనందోత్సాహాలు నింపాయి. దాదాపు 30 వేల మంది కూర్చుకుని కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. విశాలమైన మైదానం కావడంతో అంతకు రెండింతలుగా భక్తులు తరలి వచ్చినా ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా భద్రత పరంగానూ పటిష్టమైన చర్యలు చేపట్టారు. కల్యాణోత్సవం తర్వాత ఏటా లాగే ఈసారి కూడా వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించిన ప్రసాదాల్ని భక్తులకు అందించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com