కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఓటమి కారణాలు.. భవిష్యత్తు వ్యూహాలు.. అధికార పార్టీ చేస్తున్న రాజకీయ దాడులు.. వీటన్నిటిపైనా పార్టీ నేతలతో చర్చించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సోమవారం కడప జిల్లా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు మూడ్రోజులపాటు అక్కడే ఉండి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబు పర్యటన కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
టీడీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు అధినేత చంద్రబాబు. జిల్లా స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సోమవారం కడప జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం నుంచి మూడ్రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటించి పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. ఎన్నికల అనంతరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు. అధినేత తమ జిల్లాలో పర్యటిస్తుండటంతో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.
వైసీపీ నుంచి దాడులు ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్తల్లో మనోస్థైర్యం నింపటం కోసం ఇప్పటికే ఓ సారి కడపలో పర్యటించిన చంద్రబాబు ఇప్పుడు పార్టీ బలోపేతంపై మరోసారి పర్యటిస్తున్నారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించి పార్టీ ఓటమిపై కారణాలు తెలుసుకుంటారు. సోమవారం ఉదయం పదకొండున్నరకు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా రాజంపేట రోడ్డులోని శ్రీనివాస కల్యాణ మండపం చేరుకుంటారు. అక్కడ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భోజనానంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి బద్వేలు, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గాల సమీక్ష ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక రెండో రోజులన వైసీపీ బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు చంద్రబాబు. ఉదయం 11.30 గంటల నుంచి కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారు. మూడో రోజు పర్యటనలో వైసీపీ బాధితులైన చక్రాయపేటకు చెందిన కర్నాటి నాగసుబ్బారెడ్డి కుటుంబాన్ని కడపలో పరామర్శిస్తారు. 12 గంటలకు సెంట్రల్ జైలు రిమాండులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డిని పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం విజయవాడకు బయల్దేరి వెళతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com