ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

cm-kcr

సోమవారం ఆర్టీసీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. మంత్రి పువ్వాడతో పాటు రవాణాశాఖ అధికారులు కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సంస్థ మనుగడ, రూట్ల ప్రైవేటీకరణ, సమ్మెలో ఉన్న కార్మికుల భవితవ్యంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసుకోవాలని గత గురువారం జరిగిన సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష కీలకం కానుంది.

ఆర్టీసీని నడపడానికి ప్రతి నెలా రూ.640 కోట్లు కావాలని.. ఇంత మొత్తాన్ని భరించే శక్తి సంస్థకు గానీ.. తమకుగానీ లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. నష్టాల నుంచి బయట పడేందుకు బస్సు చార్జీల పెంపు ఒకటే మార్గమని.. అయితే చార్జీల పెంపు వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని యథావిధిగా నడపడం సాధ్యం కాదని ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితులను కారణంగా చూపుతూ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. ఇప్పటికే రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి రవాణాశాఖ ముసాయిదా విధివిధానాలను రూపొందించింది.

మరోవైపు ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు సోమవారం సేవ్‌ ఆర్టీసీ పేరుతో కార్మికులు నిరసన తెలపనున్నారు. సోమవారం జేఏసీ నేతలు మరోసారి సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చేసిన ప్రకటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. కార్మికులపై సీఎం కేసీఆర్‌ సానుభూతి చూపిస్తారా? విధుల్లోకి తీసుకుంటారా? లేక కఠిన వైఖరి అవలంభిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story