ప్రభుత్వం ఏర్పాటుకు 'మహా'పార్టీల వ్యూహాలు

అటు సుప్రీంలో విచారణ జరుగుతుండగానే ముంబైలో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే శివసేన-ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి తరపున మూడు పార్టీలకు చెందిన నేతలు రాజ్ భవన్ కు వెళ్లి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. తమకు 162మంది సభ్యుల మద్దతు ఉందని.. వారి సంతకాలతో కూడిన లేఖ ఇచ్చామని పార్టీ నేతలు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్దంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని లేఖలో పేర్కొన్నారు.
అటు బలపరీక్షకు కోర్టు ఎప్పుడైనా ఆదేశించే అవకాశం ఉండడంతో పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. క్యాంపు రాజకీయాలపై మరింత అప్రమత్తంగా ఉన్నాయి. బీజేపీ బలం నిరూపించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. మంగళవారం తీర్పులో 24గంటల్లో బలపరీక్షకు ఆదేశించినా.. మూడురోజుల సమయం దొరుకుతుంది. ఈలోగా సభ్యుల మద్దతు కూడగట్టేందుకు అవకాశం దొరుకుతుంది. అయితే అజిత్ పవార్ వెంట కనీసం 20మంది వస్తారని బావించినా.. వారంతా తిరిగి శరద్ పవార్ వైపు మొగ్గుచూపడంతో బీజేపీ ఆందోళనగా ఉంది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారితో బీజేపీ టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఫడ్నవిస్ కు ఇది అగ్నిపరీక్షగా మారింది.
అటు ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్ బల్ అసెంబ్లీలో అజిత్ పవార్ తో చర్చలు జరిపారు. తిరిగి ఎన్సీపీ గూటికి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే తాను నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని.. బీజేపీతోనే ఎన్సీపీ పొత్తు ఉండాలని తాను బలంగా కోరుతున్నట్టు తెలిపారు. అజిత్ వైపు ఎమ్మెల్యేలు ఎవరూ లేరంటోంది ఎన్సీపీ. ఇప్పటికే 50మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ వెంట ఉన్నారని.. మరో ముగ్గురు కూడా యువనేతల సాయంతో హరియాణా నుంచి ముంబై చేరుకున్నారని అంటున్నారు. అజిత్ ఒంటరి అయ్యారని చెబుతున్నారు. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు అసక్తికర మలుపులు తిరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com