గందరగోళంలో ఆర్టీసీ కార్మికులు

గందరగోళంలో ఆర్టీసీ కార్మికులు
X

Screenshot_1

ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గందరగోళంగా మారింది. జేఏసీ.. సమ్మె విరమణ ప్రకటన చేసినా.. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ససేమిరా అంటోంది. కొన్ని డిపోల్లో ముందుగానే విధుల్లో చేరేందుకు కొందరు కార్మికులు ప్రయత్నించారు. అయితే, వారిని చేర్చుకునేందుకు ఆర్టీసీ అధికారులు నిరాకరించారు. అటు డిపోలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అటు జేఏసీ పంపిన సమ్మె విరమణ లేఖను ఆర్టీసీ ఎండీ తిప్పి పంపేశారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్‌ కమిషన్ నిర్ణయం తీసుకునే వరకు సంయమనం పాటించాలని.. డిపోల వరకు రావొద్దని ఎండీ కార్మికులను కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రభుత్వం కాని.. ఆర్టీసీ యాజమాన్యం కాని క్షమించదన్నారు. హైకోర్టు చెప్పే ప్రక్రియ ముగిసే వరకు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను విధుల్లో తీసుకోవడం కుదరదని ఎండీ స్పష్టం చేశారు.

సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించడంపై కొందరు కార్మికులు భగ్గుమంటున్నారు. దాదాపు 30 మంది చావుకు కారణమైన జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి ఎవరికి అమ్ముడుపోయారని నిలదీస్తున్నారు. సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు ఓ కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిద్దామని అంటున్నా.. జేఏసీ ఎందుకు విరమించిందని ప్రశ్నించాడు.

మొత్తంగా జేఏసీ సమ్మె విరమణ నిర్ణయం కార్మికుల్లో మరింత ఆందోళనకు కారణమవుతోంది. అటు కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని ఆర్టీసీ ఎండీనే స్పష్టం చేయడంతో డిపోల దగ్గర గందరగోళ పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది.

Tags

Next Story