ఆక్సిజన్ బార్.. అరగంటకి రూ.600..

రండి బాబు రండి.. గాలి వార్త కాదు.. నిజమే.. స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి.. హాయిగా ఊపిరి తీసుకోండి. ఈ బార్‌కి వస్తే మీ ఆరోగ్యాన్ని పాడు చేసే బీరు దొరకదు.. మీ ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ దొరుకుతుంది. రోజంతా కాలుష్యంతో నిండిన ఢిల్లీ నగరంలో తిరిగే వారికి ఇది శుభవార్తే. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆక్సిజన్ బార్ తెరుచుకుంది. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న నగర ప్రజలను కాపాడే నిమిత్తంగా స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది ఆక్సిజన్ బార్. ఓ పదిహేను నిమిషాలు గాలి పీల్చుకోవాలనుకుంటే రూ.300లు చెల్లించాలి.
బిల్లు చూసి గుండె ఝల్లుమన్నా తప్పని పరిస్థితి. బతకాలంటే వేరే దారి లేదు మరి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఈ బార్ వెలిసింది. రానున్న రోజుల్లో అనేక నగరాలకు విస్తరించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. నగరాలన్నీ కాలుష్య కారల్లో చిక్కుకుంటున్నాయి. మనుషులకంటే వాహనాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాటి ద్వారా వచ్చే పొగను పీల్చి మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మరి రోగం తగ్గడానికి ఓ మందు బిళ్లలాగా స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ బార్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com