మూడు రోజుల్లోనే సీఎం పదవిని కోల్పోయిన ఫడ్నవీస్.. అదే వరుసలో మరికొందరు..

మూడు రోజుల్లోనే సీఎం పదవిని కోల్పోయిన ఫడ్నవీస్.. అదే వరుసలో మరికొందరు..
X

fud

ఐదేళ్ల పదవీకాలం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. సీఎం కుర్చి దక్కి ఇలా బాధ్యతలు చేపట్టారో లేదో అంతలోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ త్రీ డేస్ హిస్టరీ ఇది. ఇలాంటి పరిణామాలు గతంలోనూ ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. ఎన్నో ఏళ్ల కష్టం.. ఎన్నో కలల ఫలితమైన ముఖ్యమంత్రి పదవి అలా వచ్చినట్టే వచ్చి ఇలా వెళ్లిపోయిన సీఎంలు చాలా మందే ఉన్నారు.

ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే అషామాషీయేం కాదు. కష్టంతో పాటు కాలం కూడా కలిసి రావాల్సిందే. సుడి సరిగ్గా లేకుంటే కాలం తిరగబడుతుంది. కుర్చీ పల్టీ కొడుతుంది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఎంత చాణక్యత చూపించినా సీఎం పదవి చేతికి అందినట్లే అంది అందనంత దూరం అవుతుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కు కూడా ఇలాగే జరిగింది. ఎమ్మెల్యేలను చీల్చి.. ఏదోలా మరో ఐదేళ్లు సీఎంగా ఏలుదామని ఎత్తులు వేశాడు. కానీ, అతని లెక్క తప్పింది. అంచనాలు అమలు చేయలేకపోయారు. దీంతో సీఎం ప్రమాణం చేసిన నాలుగు రోజులకే రాజీనామా చేశారు. ఇంకా ఖచ్చితంగా చెప్పాంలంటే కేవలం 80 గంటల్లో పదవి పోయింది.

ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చటగా మారటం ఇది కొత్తేం కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి హిస్టరీ పేజీలు ఉన్నాయి. ఏడాది క్రితం కర్నాటకలోనూ బీజేపీకి సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. 2018లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. దీంతో అతిపెద్ద పార్టీయైన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ, బల పరీక్ష ఓడిపోవటంలో మూడు రోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు 2007లోనూ ఆయన 8 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నవంబర్ 12న ప్రమాణస్వీకారం చేసి 19న రాజీనామా చేశారు.

ఫడ్నవిస్, యడ్యూరప్పతో పాటు మూడు రోజుల సీఎం జాబితాలో ఉత్తప్రదేశ్ మాజీ సీఎం జగదాంబికా పాల్ కూడా ఉన్నారు. 1998 ఎన్నికల అనంతరం బీజేపీ.. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కళ్యాణ్ సింగ్ ప్లేసులో కాంగ్రెస్ కు చెందిన జగదాంబికా పాల్ సీఎం అయ్యారు. 1998 ఫిబ్రవరి 21న ప్రమాణం చేస్తే.. 23న రిజైన్ చేయాల్సి వచ్చింది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా 6 రోజుల పాటు సీఎం పదవిలో ఉన్నారు. 1990 జులై 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చౌతాలా 17న పదవికి రాజీనామా చేశారు. ఆ మరుసటి ఏడాదే మళ్లీ ముఖ్యమంత్రి పీఠం దక్కినా.. ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. మార్చి 22న పదవిలోకి వచ్చిన ఆయన ఏప్రిల్ 6న రిజైన్ చేశారు. ఇక బీహార్ లో నితిష్ కుమార్ కు కూడా అతి తక్కువ కాలం సీఎంగా ఉన్న రికార్డ్ ఉంది. మిలినియమ్ ఇయర్ మార్చి 3న ఆయన సీఎంగా ప్రమాణం చేసి.. కేవలం 8 రోజులే పదవిలో ఉన్నారు. మార్చి 10న ముఖ్యమంత్రి పోస్టుకు రాజీనామా చేశారు.

అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నవారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు. 1984 ఆగస్టు 16న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 31 రోజులకే రాజీనామా చేశారు. ఇక మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ఎస్‌సీ మరాక్ 12 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. 1998 ఫిబ్రవరి 27 సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరాక్ మార్చి 10న పదవి నుంచి తప్పుకున్నారు.

Tags

Next Story