పవన్ రాయలసీమ పర్యటన షెడ్యూల్

పవన్ రాయలసీమ పర్యటన షెడ్యూల్
X

pavan

జనసేనాని మరో సారి జనంలోకి వస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. మొన్న విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్.. ఈ సారి రాయలసీమలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రుల సొంత ప్రాంతాల్లో జనం సమస్యలను తెలుసుకోనున్నారు. డిసెంబర్ ఒకటి నుంచి ఆరు రోజుల పాటు పవన్ పర్యటన ఉంటుంది.

ప్రశ్నించేందుకు పుట్టిన జనసేన.. ఇక జనంలోకి వెళ్తోంది. ప్రజాసమస్యలే ఆయుధాలుగా అధికార పార్టీని నిలదీస్తోంది. ఇటీవలె విశాఖలో ఇసుక కొరతను ప్రశ్నించిన పవన్ భవన నిర్మాణ కార్మికులకు బాసటగా నిలబడ్డారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనపైనా ఆయన తన వాయిస్ వినిపించారు. ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాకపోయినా..అమ్మ భాష తెలుగును బ్రతికించుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. కర్నూలు మినహా మూడు రాయలసీమ జిల్లాలు కవర్ అయ్యేలా పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. డిసెంబర్ ఫస్ట్ నుంచి ఆరు రోజుల పాటు పవన్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో పవన్ చర్చలు జరుపుతారు.

డిసెంబర్ 1న మధ్యాహ్నం ఒంటిగంటకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి కడప జిల్లాకు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకుని కడప జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. అనంతరం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటారు. 2న ఉదయం 10 గంటలకు తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, నేతలతో సమావేశం ఉంటుంది. డిసెంబర్ 3న కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, నేతలతో భేటీ అవుతారు.

డిసెంబర్ 4న మదనపల్లెకు చేరుకుని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 5న అనంతపురం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించి.. స్థానిక రైతులు, చేనేత కార్మికులతో చర్చించనున్నారు. 6న పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాయలసీమ జిల్లాల్లో అక్రమ కేసులు బనాయించడం వల్ల ఇబ్బందులు పడుతున్న నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వనున్నారు జనసేనాని. అదే సమయంలో ముఖ్యమంత్రుల ప్రాంతంలోని సమస్యలను హైలెట్ చేస్తూ గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు.

Tags

Next Story