PSLV C 47 ప్రయోగానికి సర్వం సిద్ధం

కార్టోశాట్-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సి-47 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి వెళ్లనుంది. ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 ప్రయోగానికి చివరి నిమిషంలో తగిలిన ఎదురుదెబ్బతో నిరుత్సాహపడిన ఇస్రో బృందం.. కార్టోశాట్-3 ప్రయోగంతో మళ్లీ ఉత్సాహం పుంజుకోనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ-సి-47 రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. బుధవారం ఉదయం 9 గంటల 28 నిమిషాలకు ఈ ఎక్స్‌పెరిమెంట్ జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇందులో 12 ఫ్లోక్-4పి చిన్న ఉపగ్ర హాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉన్నాయి.
వాస్తవానికి ఈనెల 25నే PSLV-C-47 ప్రయోగం జరగాల్సి ఉంది. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో 4 దశల రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక అక్కడి నుంచి ప్రయోగ వేదిక మీదకు తరలించే క్రమంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లోని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలో ఇబ్బంది వచ్చింది. సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు ఈనెల 23న ప్రాబ్లెమ్‌ను సాల్వ్ చేశారు. శనివారం ఉదయం పీఎస్‌ఎల్‌వీ సీ47 రాకెట్‌ను ప్రయోగ వేదిక మీదకు తీసుకెళ్లి అనుసంధానించారు. 26 ఉదయం 6.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యింది.
తాజా ప్రయోగం షార్ నుంచి 74వ ప్రయోగం. కార్టోశాట్–3 సిరీస్‌లో ఇది ఎనిమిదో ఉపగ్రహం. మూడో తరానికి చెందిన హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహంగా కార్టోశాట్-3ని రూపొందించారు. సుమారు 509 కిలోమీటర్ల దూరంలో 97.5 డిగ్రీల వంపు కలిగిన కక్ష్యలో కార్టోశాట్‌ను ప్రవేశపెడతారు. ఇది, హై రెజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను తీస్తుంది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి చివరి నిమిషంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్బిటర్ పర్‌ఫెక్ట్‌గానే కక్ష్యలో కి చేరినప్పటికీ, ల్యాండర్, రోవర్‌లు మాత్రం చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ కాలేకపోయాయి. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ లో ప్రాబ్లెమ్ రావడంతో విక్రమ్ ల్యాండర్, చంద్రుడి దక్షిణ ధ్రువంపై కూలిపోయింది. ఇది ఇస్రో బృందానికి షాక్ కలిగించింది. ఐతే ఆ నిరుత్సాహం నుంచి శాస్త్రవేత్తలు త్వరగానే బయటపడ్డారు. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అందులో భాగంగా పీఎస్‌ఎల్వీ-సి-47 రాకెట్ ప్రయోగానికి సిద్ధమయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com