రాజధానిని చంపేస్తారా? : చంద్రబాబు

నిరసనలు.. నినాదాలు.. దాడులు.. తోపులాటల మధ్య ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సాగింది. చంద్రబాబు పర్యటన ఆరంభం నుంచే రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఆయన కాన్వాయ్‌ను ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమరావతిలో పర్యటించవద్దంటూ ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సీడ్ యాక్సిస్ రహదారిలో చంద్రబాబు కాన్వాయ్‌పైకి కొందరు రాళ్లు, చెప్పులు విసిరారు. చంద్రబాబు వెళ్తున్న బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఓ వైపు నిరసనలు హోరెత్తితే మరోవైపు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు టీడీపీ శ్రేణులు, రాజధాని రైతులు. వెంకటపాలెం దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రెండు పార్టీలకు చెందిన ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తాను యద్ధం చేయడానికి రాజధానికి రాలేదని.. కేవలం మంచి సంకల్పంతోనే రాజధానికి వస్తే.. రౌడీలతో దాడులు చేయిస్తారా అని చంద్రబాబు మండిపడ్డారు..
మొదట వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం మీదుగా పలు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు, భూముల్ని చంద్రబాబు పరిశీలించారు. ఉద్ధండరాయుని పాలెంలో రైతులు చంద్రబాబుకు పూలతో ఘన స్వాగతం పలికారు. అక్కడ అమరావతి మట్టిని చంద్రబాబు ముద్దాడారు..
రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు.. అక్కడే అమరావతి నమూనాను తిలకించారు. ఆగిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఎక్కడ జరిగిందో వైసీపీ నేతలు చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు చేసి రాజధానిని చంపేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
అమరావతి లేకుండా కేంద్రం ఇండియా మ్యాప్ విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని.. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పోరాటంతో మళ్లీ మ్యాప్‌లో చేర్చారని అన్నారు. అమరావతిని మార్చేంత ధైర్యం మీకుందా? అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంత్రుల భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. శ్మశానం చూసి ఏడవడానికి చంద్రబాబు వస్తున్నారా అని..బొత్స అంటున్నారని.. ఇప్పుడు ఆ శ్మశానంలోనే వాళ్ల సీఎం జగన్ కేబినెట్ భేటీలు పెడుతున్నారన్నారని గుర్తు చేశారు. మంత్రులు అందరూ శ్మశానంలోనే పనిచేస్తున్నారన్నారా అని నిలదీశారు.
పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ధ్వంసం చేస్తున్నారని.. ఇదే పరిస్థితి ఉంటే ఏపీకి పెట్టుబడులు రావని.. రాబడి ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రాజధానిలో సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టిందని గుర్తు చేశారు. కంట్రోల్ రూమ్ కడతామని 6 ఏళ్లు అయినా కేసీఆర్ ఇంతవరకు కట్టలేదని, ధనిక రాష్ట్రమే చేయలేని స్థితిలో ఉందన్నారు..
ఇప్పుడున్న రాజధాని కంటే సెంటర్ ప్లేస్ ఎక్కడుందని, చరిత్రలో అమరావతికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చంద్రబాబు అన్నారు. విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటును ఆహ్వానిస్తున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో జగన్ అనలేదా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com