తీవ్ర సంచలనంగా మారిన ప్రియాంకారెడ్డి హత్య.. అంతకుముందు జరిగిందిదే!

హైదరాబాద్ శివార్లలో జరిగిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య తీవ్ర సంచలనంగా మారింది. ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఘటనాస్థలాన్ని పరిశీలిస్తే.. పెట్రోల్‌పోసి నిప్పంట్టించినట్లు స్పష్టమవుతోంది. అయితే అక్కడే చంపారా? లేక ఎక్కడైనా హత్య చేసి..అక్కడికి తీసుకొచ్చి కాల్చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు 10 స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దింపారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
నవాబ్‌పేట మండలంలోని కొల్లూరులో ప్రియాంక వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తోంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో గచ్చిబౌలి నుండి శంషాబాద్ టోల్‌గేట్ ప్రాంతానికి చేరుకుంది. తొండుపల్లి టోల్‌గేట్ వద్దకు రాగానే ఆమె స్కూటర్ పంక్చర్ అయింది. బస్టాండ్ దగ్గర ఉన్న షాపులో పంక్చర్ వేయించుకొని...నక్షత్ర విల్లాలో ఉంటున్న ఇంటికి వెళ్లాలని బయలుదేరింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. మేడం బండి పంక్చర్ అయిందని చెప్పాడు. పర్లేదు మధ్యలో రిపేర్ చేయిస్తానని చెప్పినప్పటికీ అతడు విన్లేదు. మధ్యలో బండి ఆగిపోతే ఇబ్బంది పడుతారంటూ మరో యువకుడికి బండి ఇచ్చి పంపించాడు. ఎక్కడా పంక్చర్ షాపులు లేవంటూ కాసేపటికే అతడు తిరిగొచ్చేశాడు. దీంతో మరో చోటుకు వెళ్లాలని పంపించాడా వ్యక్తి..
అప్పటికే రాత్రి 9 దాటింది. పైగా హైవే ప్రాంతం కావడం...పక్కనే లారీలు ఆగి ఉండటంతో ప్రియాంకారెడ్డికి భయమేసింది. ఆ సమయంలో రోడ్డుపై పెద్దగా వాహనాల రాకపోకలు కూడా లేవు. కొందరు లారీ డ్రైవర్లు కూడా అక్కడే ఉండడంతో టెన్షన్ పడిపోయింది. ఇంటికి ఫోన్ చేసి చెల్లెలితో మాట్లాడింది. అక్కడి పరిస్థితిని క్లియర్‌గా వివరించింది. ఇక్కడ చాలా మంది ఉన్నారని.. వారిని చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. బైక్‌ను తీసుకెళ్లారని.. వాళ్లు వచ్చేవరకు తనతో మాట్లాడాలంటూ చెల్లిని బతిమిలాడింది. బండి వదిలేసి పక్కనే ఉన్న టోల్‌గేట్ దగ్గరకు రావాలని సలహా ఇచ్చింది చెల్లెలు. మళ్లీ రేపు బండి తీసుకోవడం ఇబ్బంది అవుతుందంటూ అక్కడే ఉండిపోయింది ప్రియాంకారెడ్డి.. టోల్‌గేట్ దగ్గర నిలబడితే
అందరూ చూస్తారంటూ చెప్పింది. అంతే అక్కడితో కాల్ కట్ అయిపోయింది.
ఆ తర్వాత ప్రియాంకారెడ్డి ఆచూకీ తెలియలేదు.. ఫోన్ చేసినా కలవకపోవడంతో ఇంట్లో వాళ్లు భయపడిపోయారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఉదయం రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం చటాన్‌పల్లి శివార్లలోని జాతీయ రహదారి కింద ఉన్న అడర్‌పాస్ వద్ద పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అప్పగించారు. అప్పటికే ప్రియాంకారెడ్డి మిస్సింగ్ కేసు ఉండటంతో పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు..వాళ్లు వచ్చి చనిపోయింది.. తమ కూతురు ప్రియాంకారెడ్డే అని గుర్తించారు...
డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు 10 బృందాలను రంగంలోకి దించారు. దారిలో ఆమెను ఆపి స్కూటీ పంక్చర్ అయ్యిందని చెప్పిన ఆ ఇద్దరూ ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. అలాగే ఆ దారిలో ఉన్న పంక్చర్ షాప్ వాళ్లను ప్రశ్నించారు. ఫోన్‌లోనే కొందరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిందని, నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని అన్నారు డీసీపీ ప్రకాష్ రెడ్డి. తొండుపల్లి టోల్‌గేట్ పరిసరాల్లో సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com