భయం గుప్పిట్లో హైదరాబాద్ వాసులు.. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే

భయం గుప్పిట్లో హైదరాబాద్ వాసులు.. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలే

హైదరాబాద్ రోడ్లు రక్తం రుచి మరిగాయి. గత వారం రోజుల్లోనే ఐదుగురికిపైగా మృతి చెందారు. సిటీలో రోజుకు ఏదో చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది. వాహనదారుల అతివేగంతో పాటు ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఆర్టీసీ బస్సులను చూస్తే వణికిపోతున్నారు.

హైదరాబాద్ రోడ్లంటే ట్రాఫిక్ కష్టాలే గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు ఆ నరకానికి తోడు మృత్యువు కూడా కళ్ల ముందు కనిపిస్తోంది. రోడ్డెక్కిన తర్వాత.. సేఫ్ గా ఇంటికి వెళ్తామో.. లేదో తెలియదు. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అంతుచిక్కదు. అంతా భయం భయం. హద్దు దాటిన వేగంతో దూసుకొచ్చే కార్లు, నిర్లక్ష్యంగా నడిపే ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, గజిబిజిగా నడిపే టూవీలర్లు ఇలా గత వారం రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి.

గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్రమాదం హైదరాబాద్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఫ్లైఓవర్ పై నుంచి అమాంతంగా కిందకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద నిలబడిన సత్యవతి అనే మహిళ స్పాట్ లోనే చనిపోయింది. ఫ్లై ఓవర్ సాంకేతికత సంగతి ఎలా ఉన్నా.. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించటంతో కంట్రోల్ తప్పిందని పోలీసులు నిర్ధారించారు. ఓవర్ స్పీడుతో ప్రమాదానికి కారణమైన కృష్ణ మిలన్‌రావుపై కేసు నమోదు చేశారు.

ఇక ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం, వచ్చీరాని డ్రైవింగ్ కారణంగా నగరంలో రోజుకో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మంగళవారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో ఆర్టీసీ తాత్కాలిక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ మహిళను బలితీసుకుంది. ఆర్టీసీ బస్సు అతి వేగంతో దూసుకురావటంతో టాటా కన్సెల్టెన్సీలో పనిచేస్తున్న సోహినీ సక్సేనా అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. తాత్కాలిక బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ ను దించి చితకబాదారు.

ఇక హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌-దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రధాన రహదారిపై తృటిలో ప్రమాదం తప్పింది. బస్‌స్టాప్‌లో ఆగి ఉన్న ఓ ఆర్టీసీ బస్సును.. మరో ఆర్టీసీ బస్సు వెనకాల నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చిన్న చిన్న గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. అయితే తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు ఆదివారం ఉదయం గండి మైసమ్మ చౌరస్తా సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గండి మైసమ్మ చౌరస్తా నుండి చింతల్ కు వెళ్తున్న ఆర్టసీ బస్సు అతి వేగంతో అదుపు తప్పి డివైడర్ ను ఎక్కించాడు. ప్రయాణికుల్లో కొద్ది మందికి గాయాలైనా.. పెద్ద ప్రమాదమే తప్పింది.

ర్యాష్ డ్రైవింగ్ తో హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వాహనదారుడు రోడ్డు అవతలివైపునకు వెళ్తుండగా మరో వాహనదారుడు వచ్చి ఢీకొట్టాడు.

సోమవారం ఉదయం హైటెక్స్ సమీపంలో మద్యం మత్తులో BMW కారు డ్రైవర్ రాంగ్ రూట్ లో వచ్చి బుల్లెట్, బైక్ ని ఢీ కొట్టడంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా మరో యువతి తీవ్రంగా గాయడపడింది. ఇక బుధవారం ఒక్క రోజే రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. కూకట్‌పల్లిలోని వసంత్‌నగర్‌ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తిని బలితీసుకుంది. స్కూటీని వాటర్‌ ట్యాంకర్ ఢీకొట్టడంతో.. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వాటర్‌ ట్యాంకర్‌ టైర్లు వ్యక్తిపై నుంచి వెళ్లడంతో శరీరం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. మృతుని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా ట్యాంకర్‌ను నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

ఇక ఎల్బీ నగర్ లో జరిగి రోడ్డు ప్రమాదంలో వెంకటమ్మ, సత్తెమ్మ అనే ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు కాగా కాప్రా సమీపంలో రాధిక ధియోటర్ దగ్గర జరిగిన మరో ఘటనలో స్కూటీని లారీ ఢీకొట్టడంతో సరిత అనే గృహిణి సంఘటనా స్థలంలోనే మరణించింది. వరుస ప్రమాదాలతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

Tags

Next Story