మహిళలపై తమిళ దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న మహిళా సంఘాలు..

మహిళలపై తమిళ దర్శకుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న మహిళా సంఘాలు..
X

bagyaraja

మహిళల పట్ల తమిళ దర్శకుడు భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది. సినీ గాయకురాలు చిన్మయి శ్రీపాదతోపాటు మహిళలంతా భాగ్యరాజ్ తీరును తప్పుబడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సినీ పరిశ్రమ పెద్దలే చేయడం బాధాకరమని చిన్మయి అన్నారు. ఇలాంటి మాటల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారని మండిపడ్డారు.

కట్టుబాట్లు, ఆధునిక పోకడలు, అత్యాచారాలు ఈ సబ్జెక్ట్ పై విదాదం కొత్తేమి కాదు. ఆధునిక పోకడల వల్ల, మోడ్రన్ డ్రస్ ల కారణంగానే రేప్ కేసులు పెరిగిపోతున్నాయని మంత్రి స్థాయి వ్యక్తులు కూడా నోరు పారేసుకొని విమర్శల పాలయ్యారు. ఇప్పుడు అదే లిస్టులో ప్రముఖ తమిళ డైరెక్టర్ భాగ్యరాజా కూడా చేరిపోయారు.

మహిళలపై వేధింపులకు, అత్యాచారాలు జరిగేందుకు వారే కారణమని భాగ్యరాజా చేసిన వ్యాఖ్యలతో పాత వివాదం కొత్తగా, కొత్త వ్యక్తుల మధ్య రాజుకుంది. కరుత్తుగలై పుది ఉసెయ్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న భాగ్యరాజా.. వివాహేతర సంబంధాల కోసం ఈ కాలంలో మహిళలు భర్తల్ని, పిల్లల్ని చంపేస్తున్నారని అన్నారు. సెల్‌ఫోన్ల కారణంగా మహిళలు చెడిపోతున్నారని.. కట్టుబాట్లను వదిలేస్తున్నారని అన్నారాయన. ఇప్పుడు మహిళలు ఎప్పుడూ ఫోన్‌లలోనే ఉంటున్నారు. రెండేసి ఫోన్ సిమ్‌లు వాడుతున్నారు. వారిపై వేధింపులు, అత్యాచారాలు జరగడానికి ఇదొక కారణం అన్నారు.

అంతటితో ఆగకుండా తమిళనాట తీవ్ర సంచలనం రేపిన పొల్లాచ్చి ఘటనపై కూడా ఆయన ఇలాంటి కామెంట్లే చేశారు. పొల్లాచ్చి ఘటనలో మగవాళ్లది ఎలాంటి తప్పులేదని.. అక్కడ అమ్మాయి అవకాశం ఇచ్చింది కాబట్టే రేప్ జరిగింది అని భాగ్యరాజా వివాదానికి తెరతీశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతున్నాయి. భాగ్యరాజా వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలపై పురుషులు అత్యాచారాలు చేస్తే వారి తప్పేమీ లేదంటారా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై సినీ గాయకురాలు చిన్మయి శ్రీపాద స్పందించారు. మహిళల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని సినీ పరిశ్రమ పెద్దలు చెప్పడం బాధాకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే అమ్మాయిలు చనిపోతున్నారని మండిపడ్డారు. మరోవైపు భాగ్యరాజాపై తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భాగ్యరాజాపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ తమిళనాడు మహిళా కమిషన్‌కు లేఖ రాశారు.

Tags

Next Story