నిజామాబాద్ జిల్లాలో పెదరాయుడు తీర్పు.. గ్రామ బహిష్కరణ.. తీర్పుకి ఎదురే లేదు

ఆధునిక యుగంలో కూడా సమాజంలో ఆటవిక చర్యలు ఆగడం లేదు. గ్రామాల్లో కొంతమంది పెద్దరాయుళ్లు సమాజం తలదించుకునే ఘటనలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో గ్రామ కమిటీల ఆగడాలు మితిమీరుతున్నాయి. తమ ఆదేశాలు ధిక్కరించిన వారిపై సాంఘిక బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూశాయి. అధికారులు చర్యలు తీసుకోకపోడంతో వీటికి ఫుల్‌ స్టాప్‌ పడటం లేదు.

వేల్పూరులో ఓ భూ వివాదం విషయంలో ముస్లిం మైనార్టీలపై బహిష్కరణ వేటు వేశారు. మండల కేంద్రంలోని 4 ఎకరాల 12 గుంటల భూమిని ఎన్నో ఏళ్లుగా ముస్లింలు శ్మశాన వాటికగా వినియోగిస్తన్నారు. శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి 8 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో శ్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రయత్నించారు స్థానికులు. అయితే, ఈలోగా గ్రామ కమిటీ సభ్యులు ఎంటరై అడ్డు పుల్ల వేశారు. ప్రహరీ గోడ నిర్మించడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అయితే, ఆ వర్గం ఈ ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో గ్రామ కమిటీ సభ్యులకు కోపం వచ్చింది. వెంటనే వెలి అనే నిర్ణయాన్ని అమలు పరిచారు. ఆ వర్గానికి చెందిన వారు నడిపే ఆటోల్లో ప్రయాణించకూడదని, వారి షాపుల్లో ఏ వస్తువులూ కొనుగోలు చేయొద్దంటూ పెదరాయుళ్లు తీర్పు చెప్పేశారు.

చివరకు ఏం చేయాలో తెలియక బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటన సాక్షాత్తు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి సొంత గ్రామంలోనే జరగడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. మంత్రి స్వగ్రామంలోనే ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయంటే గ్రామ కమిటీలు ఏ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు అధికారులు కూడా ఈ ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆధునిక కాలంలోనూ ఇలాంటి ఆటవిక పోకడలేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పాలకులు జోక్యం చేసుకుని గ్రామ కమిటీల ఆగడాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story