రాజ్యసభ సీటు లేదంటే అధ్యక్ష పదవిపై లక్ష్మణ్ ఆశలు

రాజ్యసభ సీటు లేదంటే అధ్యక్ష పదవిపై లక్ష్మణ్ ఆశలు

lakshman

తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పదవి పగ్గాలు మరోసారి చేపట్టేందుకు లక్ష్మణ్ పావులు కదుపుతున్నారు. గతంలో తాను చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ప్రజా ఉద్యమాలు, పార్టీలో చేరికలు తదితర అంశాలతో ఢిల్లీ వెళ్లి అధినాయకత్వం మెప్పుపొందే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇప్ప‌టికే ఎంపీ ఎన్నిక‌ల్లో త‌న హయాంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా నాలుగు స్థానాలు గెలుపొంద‌డం.. రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో స‌త్తా చాటుతుంద‌న్న ధీమాతో... మరోసారి అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని పలువురు సీనియర్ సంఘ్ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా పార్టీలో చేరినవారికి ఇతర వ్యక్తులకు గాని అధ్యక్ష పదవి దక్కకపోవచ్చని ఢిల్లీ నేతలు చెబుతున్నారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల త‌రువాత వివిధ‌ పార్టీల నుంచి బీజేపీలోకి వలస వచ్చిన నేతలకు ఈసారి అధ్యక్ష పదవి అందని ద్రాక్షగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ లో ముఖ్య నేతలుగా ఉన్న నలుగురు, ఐదుగురు వ్యక్తుల మధ్యనే తీవ్రమైన పోటీ ఉన్న‌ట్టు సమాచారం. దీంతో తనకు చిరకాల మిత్రులుగా ఉన్న మాజీ జాతీయ నేత‌ల‌తో లక్ష్మణ్ ఢిల్లీలో సమావేశాలు అవుతున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది. అందులో భాగంగా దక్షిణాదిలోని రెండు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగు ఎంపీ స్థానాలు ఇప్ప‌టికే తెలంగాణలో గెలిచింది. ఇక ఏపీలో ఆ పరిస్థితి లేదు. దీన్ని భర్తీ చేయడానికి అటు ఏపీలో ఇటు తెలంగాణ లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ అంశాలన్నింటిపై తాజా వివరాలను ఎప్పటికప్పుడు జాతీయ నాయకత్వానికి లక్ష్మణ్ చేరవేస్తున్నారు. ఇన్ని అనుకూల‌త‌ల మ‌ధ్య‌ మరోసారి తనకు అధ్యక్ష పదవి వ‌స్తుంద‌న్న‌ నమ్మకంతో వీలు కుదిరినప్పుడల్లా హస్తిన వెళ్తూ అవ‌కాశాల‌ను మ‌రింత మెరుగు ప‌రుచుకునే ప‌నిలో ల‌క్ష్మ‌ణ్ ఉన్నార‌ని తెలుస్తోంది. రాజ్యసభ సీటు లేదా అధ్యక్ష పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న లక్ష్మణ్ కు ఏ మేరకు జాతీయ నాయకత్వం ఆశీస్సులు ఉంటాయో చూడాలి మరి.

Tags

Next Story