అమ్మాయిలూ మీ ఫోన్‌లో తప్పక ఈ 'యాప్‌'ని డౌన్‌లోడ్ చేసుకోండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి..

అమ్మాయిలూ మీ ఫోన్‌లో తప్పక ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి..

app

చుట్టూ జనం ఉంటే కొంత రక్షణ. జన సంచారం లేని ప్రదేశంలో రోజూ వెళ్లి రావడమంటే ఎంత కష్టం. ఏ చెట్టు చాటున ఏ క్రూర మృగాళ్లు దాగున్నారో.. అదను చూసి మాటు వేయడానికి. అన్యాయంగా అమాయకులను బలిచేయడానికి. మృగాళ్లకు శిక్షలెక్కడ.. దర్జాగా మన మధ్యలోకే మళ్లీ.. ఆమె భయపడినంతా అయింది. మృగాళ్ల కామదాహానికి ప్రియాంక బలైంది. పశువుల డాక్టర్ అయినా మనుషుల్లోని పశువాంఛకు ప్రియాంక జీవితం బలైపోయింది.

క్షణికానందం కోసం ఓ నిండు జీవితాన్ని బలి చేయడానికి వాళ్లకి మనసెలా ఒప్పిందో. కరుడు గట్టిన హృదయాలకు తమ బిడ్డలు గుర్తుకు రాలేదేమో. వాళ్లూ ఓ తల్లికి పుట్టిన వాళ్లే. వాళ్లకి అక్కా, చెల్లి ఉండి ఉంటారు. అయినా ఆడదాన్ని చూడగానే చొంగ కారుస్తున్నారు. మానవత్వం మంటగలిసి పోతోంది. మనుషులు మరీ ఇంత నీచ స్థితికి ఎందుకు దిగజారుతున్నారో. జాలి, దయ, కరుణ.. ఇసుమంతైనా కనిపించడం లేదు. నెలల పసి బిడ్డలనూ వదలట్లేదు.. ముదిమి వయసులో ఉన్న ముసలమ్మలనూ వదలట్లేదు.

ప్రియాంక పోలీసు అధికారిక యాప్ 'హాక్-ఐ' లేదా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 100 ను సంప్రదించి ఉంటే హత్యకు గురయ్యే వారు కాదు. ఈ యాప్‌ని లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నా కేవలం వందల మందే వాడుతున్నారు. 'హాక్-ఐ' లో ఉన్న ఎస్ఓఎస్‌లో ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఎస్ఓఎస్ ను నొక్కితే పోలీసులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుని ఉండేవారని పోలీస్ అధికారులు భావిస్తున్నారు.

ఆఫీస్ టైం దాటి పోయింది. సమయానికి ఇంటికి చేరుకోలేపోయారు. ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటుంది. ఆకతాయిలు ఏమైనా చేస్తారేమో అనే భయం. అలాంటి వారి రక్షణకోసమే ఈ యాప్. హాక్‌-ఐలో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్. ప్రయాణానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించి ఆమె ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్తున్నారో ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నంబర్లను ఫోటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యేవరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది.

దాంట్లో ఫీడ్ చేసిన ప్రకారం కాకుండా మీరు ఎక్కిన వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులు గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. అటువైపు నుంచి రెస్పాన్స్ లేకుంటే వెంటనే రంగంలోకి దిగుతారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ఈ యాప్‌తో పాటు డయల్ 100, వాట్సాప్ హైదరాబాద్ నెంబర్ 9490616555, సైబరాబాద్ నెంబర్ 9490617444, రాచకొండ 9490617111 ద్వారా ఎలాంటి సహాయం కావలన్నా పొందొచ్చు. ఈ యాప్ తెలంగాణ వ్యాప్తంగా సేవలు అందిస్తుంది అని పోలీస్ అధికారులు వివరించారు.

Next Story