వీధుల నుంచి విధుల్లోకి.. ఉదయాన్నే డ్యూటీలో చేరిన కార్మికులు

వీధుల నుంచి విధుల్లోకి.. ఉదయాన్నే డ్యూటీలో చేరిన కార్మికులు

emp

సీఎం కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవటంతో.. రాష్ట్రంలో అన్ని డిపోలలో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని డిపోల వద్ద సుదీర్ఘ పోరాటం తర్వాత డ్యూటీల్లోకి వచ్చిన వాళ్లంతా పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్ననారు. గురువారం వరకూ ఉద్యోగం ఉంటుందో.. పోతుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో సమ్మె కొనసాగించిన ఆర్టీసీ కార్మికులు.. 55 రోజుల తర్వాత సమస్య పరిష్కారం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే సమ్మె చేశామని.. ఇంత సుదీర్ఘంగా ఇది జరుగుతుందని తాము అనుకోలేదని చెప్తున్నారు. సమ్మె సమయంలో కొందరిపై కేసులు పెట్టారని, ప్రభుత్వం వాటిని కొట్టేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అటు.. ఉమ్మడి నల్గొండ పరిధిలోని ఏడు డిపోల్లో ఉద్యోగులంతా విధుల్లో చేరారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బస్సులు నడుస్తున్నాయి. అలాగే డిపోల్లోని అన్ని వర్గాల కార్మికులు డ్యూటీల్లోకి రావడంతో.. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు, ఇతరత్రా క్లీనింగ్ కార్యక్రమాలు వంటివి స్పీడ్‌గా జరుగుతున్నాయి.

ఇక, మెదక్ జిల్లాలోని అన్ని డిపోల్లోనూ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరిన సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని కాపాడుకోవడం తమ బాధ్యతని.. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులంతా విధుల్లో చేరారు. ఫస్ట్ షిఫ్ట్‌ డ్యూటీకి వెళ్లాల్సిన వాళ్లంతా తెల్లవారుజామునే డిపోలకు చేరుకున్నారు. దీంతో, వంద శాతం బస్సులు రోడ్డెక్కాయి. గురువారం రాత్రి KCR ప్రకటనతో సమ్మె ముగింపునకు శుభం కార్డు పడడంతో.. డిపో మేనేజర్లు వెంటనే పరిస్థితి చక్కదిద్దేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి తిరగాల్సిన బస్సులకు సంబంధించిన సమాచారం, డ్యూటీలోకి వచ్చే వాళ్ల వివరాల్లాంటివన్నీ సిద్దం చేశారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద ప్రభుత్వం 100 కోట్లు మంజూరు చేయడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి డిపోలో ఇద్దరు ప్రతినిధులతో కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతించారు. ఉదయం నుంచి విధుల్లో చేరుతున్న వారంతా.. DM సమక్షంలో డ్యూటీ ఛార్ట్‌లో సంతకం చేసి బస్సులు తీస్తున్నారు. 55 రోజుల తర్వాత సమస్యకు పరిష్కారం దొరకడంతో 2 నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన తమకు కొంత ఊరట దొరికిందని కార్మికులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story