బలపరీక్షలో మహావికాస్ ఆఘాడీ కూటమి విజయం లాంఛనమే

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. థాకరేకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఉద్ధవ్‌కు సిబ్బంది స్వాగతం పలికారు. కొత్త ముఖ్యమంత్రిని తమ సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాకరే గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు..
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3లోపు బలాన్ని నిరూపించుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చెప్పారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రకటించాయి..
మహారాష్ట్రలో పార్టీల బలాబలాలు చూస్తే..బీజేపీ - 105, శివసేన - 56, ఎన్సీపీ - 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు ఉన్నారు..ఎన్నికల్లో బీజేపీ-శివసేన కలిసిపోటీచేశాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దీంతో శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..అయితే శనివారం జరిగే బలపరీక్షలో మహావికాస్ ఆఘాడీ కూటమి విజయం లాంఛనమే కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com