ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన గవర్నర్

governor-tamilasai

శంషాబాద్‌లోని ప్రియాంక రెడ్డి నివాసానికి చేరుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. కుటుంబ సభ్యులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామంటూ ధైర్యం చెప్పారు. కేసు దర్యాప్తు వివరాలను అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు...

అటు షాద్‌నగర్ పీఎస్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అందరినీ చెదరగొట్టారు. పోలీస్‌ స్టేషన్ వద్దకు..ఉదయమే పెద్దసంఖ్యలో చేరుకున్న నిరసనకారులు దాదాపు 5 గంటలకుపైగా ఆందోళన కొనసాగించారు. స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. బారికేడ్లను విసిరిపారేశారు. ఒకదశలో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. జనాల్ని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. అదే సమయంలో నిరసనకారులు..పోలీసులపైకి చెప్పులు విసిరారు. పరిస్థితి పూర్తిగా దిగజారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. స్టేషన్ ముందు నుంచి ఆందోళనకారుల్ని తరిమికొట్టారు.

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు నలుగురికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వాళ్లని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో నిందితుల్ని కోర్టుకు తీసుకెళ్లే సాహసం చేయలేదు పోలీసులు. బయటకు తీసుకొస్తే మూకదాడి జరిగే అవకాశం ఉండడంతో.. అప్రమత్తంగా వ్యవహరించారు. షాద్‌నగర్‌ మేజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో తహసీల్దార్ ముందు నిందితుల్ని ప్రవేశపెట్టారు.

స్టేషన్ వద్దకు భారీగా జనం తరలిరావడం.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో..తహసీల్దార్‌ పాండునాయకే స్టేషన్‌కు వచ్చారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితుల్ని జైలుకు తీసుకెళ్లేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు..

అంతకుముందు షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ రణరంగాన్ని తలపించింది. జనం వేలాదిగా తరలిరావడంతో ఏక్షణం...ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తలెత్తింది..కోర్టుల్లో నెలల తరబడి విచారణ జరిపే బదులు స్పాట్ జడ్జిమెంటే ఉండాలని డిమాండ్ చేశారు జనం. పోలీసుల్ని తోసుకుంటూ మరీ స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో.. ముందు జాగ్రత్తగా గేట్లకు చైన్లు బిగించి తాళం వేశారు. పెద్దఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. జనం ఆగ్రహం ముందు బారికేడ్లు కూడా నిలవలేదు. అన్నింటినీ ఎత్తిపడేశారు..జనం భారీగా వస్తుండటంతో క్షణక్షణానికి పరిస్థితి చేయిదాటిపోతోంది. వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చి రోడ్డుపనే బైఠాయించి గంటల తరబడి కదలకుండా న్యాయం కోసం డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story