'దిశ' ఘటనపై రాజ్యసభలో వాడివేడి చర్చ

హైదరాబాద్ దిశ ఘటనపై పార్లమెంట్‌లో వాడివేడి చర్చ జరుగుతోంది. దిశా ఘటనతో పాటు దేశంలో హత్యాచారాలపై.. రాజ్యసభలో బీజేపీ ఎంపీ ప్రభాత్ ఝా జీరో అవర్ నోటీసులు ఇచ్చారు. దీనిపై ప్రసంగించిన ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్.. దిశ హత్య దేశం మొత్తాన్ని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేయాలన్నారు.
టీడీపీ ఎంపీ కనకమేడల మాట్లాడుతూ.. హైదరాబాద్ ఘటన.. ఢిల్లీ ఘటనను గుర్తు చేసి మరోసారి ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసిందన్నారు. జీరో ఎఫ్ఐఆర్‌పై సుప్రీం ఆదేశాలను పాటించాలన్నారు. ఘటనకు ముందు పెట్రోలింగ్, రక్షణ చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్భయ చట్టంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్ దిశ ఘటన దురృష్టకరమన్నారు టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాష్. దేశంలో గత కొంతకాలంగా.. మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారాయన. ఇలాంటి ఘటనలు నియంత్రించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు దిశ హత్యోదంతంపై స్పందించిన ఎంపీ జయాబచ్చన్.. ఈ ఘటన చాలా దురృష్టకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని భావన కలిగేలా తీర్పు ఉండాలన్నారు.
అటు లోక్‌సభలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే జీరో అవర్‌లో చర్చిద్దామని లోక్‌సభ స్పీకర్ తెలిపారు. క్వశ్చన్ రద్దుచేసి దిశ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com