హాంకాంగ్‌లో కొనసాగుతున్న ఆగ్రహ జ్వాలలు

హాంకాంగ్‌లో కొనసాగుతున్న ఆగ్రహ జ్వాలలు

hongkng

హాంకాంగ్‌ ప్రజల ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. హాంకాంగ్‌ హక్కులను హరించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై భయాందోళనలు వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రజలు ఆర్నెల్లుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు తమకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు హాంకాంగ్‌ ప్రజలు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

హాంకాంగ్‌లోని స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూలవాదులు ఘనవిజయం సాధించారు. అయినా, అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారలేదు. చైనా నియంతృత్వ పోకడలపై రగిలిపోతూనే ఉన్నారు. స్థానిక ఎన్నికలు ముగిసి వారంరోజులు తిరక్కుండానే మళ్లీ నిరసనలు హోరెత్తాయి. నల్లదుస్తులు ధరించిన వేలాదిమంది ఆందోళనకారులు నగర వీధుల్లోకి పోటెత్తారు. చైనా నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికీ తమ గోడును పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేందుకే తాము నిరసనలు తెలియజేస్తున్నట్లు ప్రజలు చెబుతున్నారు.

సిమ్‌షా సుయిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆందోళనకారులు వేలాదిగా రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినా ఉద్యమకారులు వెనక్కు తగ్గకపోవడంతో చివరకు పెప్పర్‌స్ప్రేను ప్రయోగించారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

మరోవైపు ఉద్యమకారులకు మద్దతుగా రూపొందిన ఒక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయడంతో.. ఆయనకు వినూత్న రీతిలో అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వేలాది మంది ఆందోళనకారులు అమెరికా రాయబార కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. హాంకాంగ్‌కు స్వేచ్ఛను కల్పించాలంటూ వారు నినాదాలు చేశారు. పలువురు ట్రంప్‌ వేషధారణలో కనిపించారు.

మరోవైపు ట్రంప్‌ సంతకం చేసిన ఈ బిల్లుపై చైనా తీవ్రంగా మండిపడుతోంది. దీనికి ప్రతిగా గట్టి చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. దీనికి కారణం హాంకాంగ్‌కు ప్రస్తుతం ప్రత్యేక అమెరికా వాణిజ్య పరిశీలన హోదా ఉంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతోంది. ఈ హోదాను కాపాడుకోవాలంటే హాంకాంగ్‌కు సరిపడిన స్థాయిలో స్వయం ప్రతిపత్తి ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఏటా ధ్రువీకరించాల్సి ఉంటుందని తాజా చట్టం సృష్టం చేస్తోంది. హాంకాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన చైనా, హాంకాంగ్‌ అధికారులపై ఆంక్షలకూ ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. అయితే, దీనిపై హాంకాంగ్‌ ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story