సంకీర్ణ ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు

మహారాష్ట్రలో సంకీర్ణ శకం ఆరంభమైంది. ప్రభుత్వ పాలనా పగ్గాలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించిన ఉద్ధవ్ థాక్రే.. మిత్రులుగా ఉందాం, కలిసి పనిచేద్దామంటూ విపక్షాలకు పిలుపునిచ్చారు. అటు మంత్రివర్గ కూర్పులో ఆధిపత్యం ప్రదర్శించాలని ఎన్సీపీ అధినేత పవార్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 16 కేబినెట్ బెర్తులు ఎన్సీపీ ఖాతలో పడే ఛాన్స్ కనిపిస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో సీన్ మారిపోయింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. విధి, ప్రజల ఆశీర్వాదమే తనను ఇక్కడకు తీసుకువచ్చిందన్నారు. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నానంటూ ఫడ్నవీస్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. మిత్రులుగానే కొనసాగుదామని ఉద్ధవ్ అసెంబ్లీ వేదికగా విపక్షాలకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటికీ హిందూ ఐడియాలజీకి కట్టుబడి ఉన్నానని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. తన దృష్టిలో హిందుత్వం అంటే అబద్ధాలు చెప్పడం కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడటమే తనకు తెలిసిన..తాను ఆచరించే హిందుత్వమని పేర్కొన్నారు. తన హిందుత్వం చెక్కుచెదరలేదని ఉద్ధవ్ చెప్పారు.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటులో తెరవెనకుండి శాశించిన శరద్ పవార్.. మంత్రివర్గ కూర్పు, మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారు. మంత్రివర్గంలో అధిక భాగం ఎన్సీపీకే దక్కేలా వ్యూహం రచిస్తున్నారు. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖల కూడా ఎన్సీపీ ఖాతాలోనే వేయాలని శరద్ పవార్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 43 కేబినెట్ మంత్రి పదవులుండగా, అందులో 16 కేబినెట్ బెర్త్‌లు ఎన్సీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌కే అత్యంత కీలకమైన స్పీకర్ పదవి వరించడంతో, ఎన్సీపీ బెట్టు చేస్తున్నా సరే.. కాంగ్రెస్ ఏమనడం లేదని కొందరు భావిస్తున్నారు. ఇక, శివసేనకు 15 బెర్తులు, కాంగ్రెస్‌కు 12 బెర్త్‌లు లభించనున్నట్లు తెలుస్తోంది. అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ, ఆర్థికం ఎన్సీపీకే దక్కనున్నట్లు సమాచారం. శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడైన జయంత్ పాటిల్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో పాటిల్ హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రెండో వ్యక్తి ఛగన్ భుజ్‌బల్. ఉద్ధవ్‌తో పాటు మంత్రిగా భుజ్‌బల్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక, డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్‌కు దక్కనున్నట్లు సమాచారం. అయితే దీనిపై పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. మహా వికాస్ అగాఢీలో మరో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు మరో కీలక శాఖ అయిన రెవెన్యూ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ పదవికి మహా కాంగ్రెస్ చీఫ్ బాలసాహెబ్ థోరట్‌తో పాటు మాజీ సీఎం అశోక్ చవాన్ పోటీ ఉన్నారు.
మంత్రివర్గ కూర్పులోనే కాదు.. పాలనలోనూ ఎన్సీపీ పట్టు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఉద్ధవ్ థాక్రేను కలిసిన ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే రెండు విజ్ఞప్తులను ఆయన ముందుంచారు. ప్రత్యేక సామర్థ్యం కలవారి కోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని.. మహా పోర్టల్ని రద్దు చేయాలని ఆమె కోరారు. మహా పోర్టల్ పనితీరుపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిని రద్దు చేయడమే మంచిదనే ప్రతిపాదనను సీఎం ముందుంచారు. యువతకు మెరుగైన సేవలందించేందుకు మరో పోర్టల్‌ను ప్రారంభించాలని ఆమె ఉద్ధవ్ థాక్రేను కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com