సర్కార్ నిర్ణయం.. ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. ఇంజినీరింగ్ ఐదేళ్లు

సర్కార్ నిర్ణయం.. ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. ఇంజినీరింగ్ ఐదేళ్లు
X

students

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 2020 నుంచి డిగ్రీ నాలుగేళ్లు, ఇంజినీరింగ్ ఐదేళ్లు చేయనున్నారు. డిగ్రీలు చేతికి వచ్చినా సరైన స్కిల్స్ లేక ఉద్యోగాలు రావడం లేదు, అందుకే డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తయిన తరువాత ఏడాది అప్రెంటిస్‌షిప్ చేయాలనే నిబంధనను ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధానాలను విడుదల చేయనుంది.

వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందేవారికి ఇవి వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. డిగ్రీ విద్యార్థులకు ఫస్ట్, సెకండియర్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు ఉంటాయి. చివరి ఏడాది ఆరో సెమిస్టర్‌లో నైపుణ్య కోర్సులను చదవాల్సి ఉంటుంది. అప్రెంటిస్ చేసే సమయంలో విద్యార్థులకు బోధన రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుంది. వసతి, భోజనానికి రూ.20 వేలు అదనంగా ఇస్తారు. అప్రెంటిస్‌షిప్ సమయంలో కంపెనీల ఉపకారవేతనాలిస్తే మాత్రం ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయదు.

Next Story